Leading News Portal in Telugu

ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ | brs petition on election symbols dismissed| supreme| court| election commission


posted on Oct 20, 2023 2:37PM

ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం కోర్టులో ఎన్నికల గుర్తులపై ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం (అక్టోబర్ 20) కొట్టివేసింది. గత ఎన్నికల నుంచీ కూడా బీఆర్ఎస్ తమ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్ ను తొలగించాలని, ఇతరులెవరికీ కేటాయించవద్దని చెబుతైవస్తోంది. ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో కారును పోలిన ఎన్నికల గుర్తులను రాష్ట్రంలో వేరెవరికీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

 గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్డు రోలర్ వంటి కారును పోలిన సింబల్స్‌ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్డు రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యధాతథంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కారు గుర్తును పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.