తెలంగాణలోనూ బీజేపీకి జనసేన రాంరాం.. తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు?! | janasena avoid bjp in telangana also| allance| tdp| contest| win
posted on Oct 20, 2023 4:44PM
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ విధానాలేంటి, వ్యూహాలేంటి అన్న విషయంలో ఆ పార్టీకి చందిన రాష్ట్ర నాయకులకే అవగతం కావడం లేదు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఒక బలపైన విపక్షం జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీని పట్టించుకోకుండా.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ.. రాష్ట్రంలో తనకున్న కొద్ది పాటి బలాన్ని కూడా చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చేసి కలిసి వస్తే రండి లేకుంటే పొండి అంటూ బంతిని బీజేపీ కోర్టులో పడేసింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అసలే స్టేక్ లేని బీజేపీకి గత ఎన్నికలలో వచ్చిన ఒక శాతం ఓటు కూడా అనుమానమే అని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న వైసీపీకి తమ పార్ట హైకమాండ్ అండదండగా నిలిచి తమను పలుచన చేస్తున్నదో అవగతం కాలేదంటూ ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చే స్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అక్కడ అధికారమే తరువాయి అన్నంతగా బలపడిన పార్టీని చేజేతులా మళ్లీ మొదటికి అంటే సింగిల్ డిజట్ స్థాయికి దిగజారడానికి కారణం కూడా అధిష్థానమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద దక్షిణాదిలో బలపడాలంటే పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ బలోపేతం చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిన బీజేపీ అగ్రనాయకులు.. ఆయా రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీలను అంటే బలహీనం చేస్తే చాలన్న ఎత్తుగడతో వెళ్లి మొదటికే మోసం వచ్చేలా వ్యవహరించారని పరిశీలకులు అంటున్నారు.
ఏపీలో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలన్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందని అంటున్నారు. ఏపీలో మిత్ర పక్షంగా ఉన్న జనసేన కూడా ప్రజాభిప్రాయానికి తలొగ్గి బీజేపీతో మైత్రి ఉన్నా లేకపోయినా ప్రజాభీష్టం ఎలా ఉంటే అలా నడుచుకోవాలని నిర్ణయించుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం తీరే కారణమని విశ్లేషిస్తున్నారు. సరే ఏపీలో అలా ఉంటే.. ఇక తెలంగాణలో అధికారమే తరువాయి అన్న స్థితి నుంచి అన్నినియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి పార్టీ దిగజారడానికి కూడా బీజేపీ హైకమాండ్ తీరే కారణమని అంటున్నారు. తీరా ఎన్నికల ముంగిటకు వచ్చిన తరువాతైనా ఇక్కడ కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోవడానికి బదులు బరిలో నిలవవద్దంటూ వాటిపై ఒత్తిడి తీసుకువచ్చి పెద్దన్న పాత్ర పోషించి అజమాయిషీ చేయాలని చూడటం కూడా వికటిస్తోందని అంటున్నారు. తెలంగాణలో 36స్థానాలలో పోటీకి జనసేన నిర్ణయించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిన స్థితిలో బీజేపీ రంగ ప్రవేశం చేసి జనసేనతతో తన మైత్రికి చూపుతూ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి మద్దతు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన బూమరాంగ్ అయ్యింది. తెగదెంపులు చేసుకోవడానికైనా రెడీ కానీ పోటీకి దూరంగా ఉండే ప్రశక్తే లేదని జనసేనాని బీజేపీకి తేల్చి చెప్పేశారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏపీలో తన తీరుతో జనసేనను దూరం చేసుకున్న బీజేపీ తెలంగాణలో కూడా అదే అపరిపక్వ తీరుతో ఆ పార్టీకి దూరం అవుతోందని అంటున్నారు.
ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్నాం కనుక బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికలలో ముందుకు సాగడమే బాగుంటుందని అన్న జనసేనానికి వ్యాఖ్యలను స్వాగతించాల్సింది పోయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆయనకు బీజేపీ అధిష్ఠానం ఒక ప్రతిపాదన పంపిందని అంటున్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం ఎన్డీయే మిత్ర పక్షంగా జనసేన తెలంగాణ ఎన్నికలలో అభ్యర్థులను రంగంలోకి దింపకుండా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పని చేయాలి. అయితే ఈ ప్రతిపాదనను జనసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా పోటీకి దూరంగా ఉండి జనసేన చేసిన త్యాగాన్ని బీజేపీ ఇసుమంతైనా గుర్తించలేదనీ, పైపెచ్చు ఏరు దాటాకా అన్న సామెతలా తెలంగాణలో ఎవరి పొత్తూ లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు గుప్పించి మిత్ర ధర్మాన్ని విస్మరించిందనీ జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
అంతే కాకుండా సొంత బలం లేని బీజేపీ తమను పోటీ చేయకుండా మద్దతుకే పరిమితం అవ్వాలంటూ ఒత్తిడి చేయడం హాస్యాస్పదమంటున్నాయి. ఇక బీజేపీలో సీనియర్లు కూడా అధిష్థానం తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో.. జనసేనతో కలసి పోటీ చేయడమే మంచిదని అంటున్నారు. ఇక పోతే బీజేపీ ప్రతిపాదనతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసేనాని తెలుగుదేశంతో కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీలోకి దిగే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్ని నిర్ణయం తీసేసుకుంది సమయం మించి పోయిన కారణంగా ఆ పొత్తును తెలంగాణలో కూడా కొనసాగించే విషయంలో తెలుగుదేశం, జనసేనలు నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే జనసేన 36 స్థానాలలో అభ్యర్థులను నిలపాలని నిర్ణయించింది.
తెలుగుదేశం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలిపేందుకు నిర్ణయించినప్పటికీ.. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాల నేపథ్యంలో ఎన్నిస్థానాలలో పోటీ అన్న విషయంలో ఒక క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం వెళ్లి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆ తరువాత రాష్ట్రంలో 86స్థానాలలో తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏయే స్థానాలలో అన్న త్వరలో ప్రకటిస్తామనీ, ఈ లోగా జనసేనానితో కూడా చర్చించి కలిసిఎన్నికలు వెళ్లే విషయమై చర్చిస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని కలిసే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారుప తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెడితే ఈ కూటమి అభ్యర్థులు రాష్ట్రంలోని 119 స్థనాలలోనూ పోటీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే ఈ కూటమి రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు.