Leading News Portal in Telugu

బాబుకు సజ్జల సలహా బూమరాంగ్.. ముందు జగన్ జైలుకెళ్లాలంటున్న నెటిజన్లు! | sajjala comments boomerang | netizens| suggest| jagan| jail| 10years


posted on Oct 20, 2023 5:42PM

సజ్జల రామకృష్ణా రెడ్డి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి. ఈయన  ఇటీవల మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అవినీతి పరుడు. అందుకే జైలుకు వెళ్లారు. ఒక వేళ ఆయన అవినీతికి పాల్పడి ఉండకపోతే ఆయన జైలుకు ఎందుకు వెడతారు? తన నిర్దోషిత్వాన్ని జైల్లో  ఉండే విచారణను ఎదుర్కొని ఎందుకు రుజువు చేసుకోకుండా క్వాష్ పిటిషన్ వేస్తారు అని ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. జైల్లో ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై సైతం సెటైర్లు వేసి జనంలో పలుచన అయ్యారు. అయితే అవన్నీ  పక్కన పెడితే ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యలే  వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి. ఆయన వ్యాఖ్యలు  బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. వైసీపీ నేతలు కూడా జగన్ ను సజ్జల వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయని అంటున్నారు. 

ఎందుకంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కనుకనే అరెస్టయ్యారు. తన నిజాయితీని నిరూపించుకోవలసిన బాధ్యత  ఆయన మీద ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు సూటిగా జగన్ అక్రమ  కేసులలో 16 నెలలు జైలులో ఉన్న సంగతిని  గుర్తు చేశాయి. ఇప్పుడు ఆ మాటలనే తెలుగుదేశం  నాయకులు ప్రస్తావిస్తూ  జగన్ అవినీతికి పాల్పడ్డాడు కనుకనే  16 నెలలు జైలుకు వెళ్లారని సజ్జల అంగీకరించేశారుగా అంటున్నారు. జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారే  ఆ మాటలు చెప్పిన  తరువాత ఒక్క క్షణం కూడా  సీఎంగా  ఉండే అర్హత జగన్ కు లేదని అంటున్నారు. ఆయన తక్షణమే జైలుకు వెళ్లి.. తన నిజాయితీని  నిరూపించుకున్న తరువాత బయటకు  రావాలని అంటున్నారు. ఇక  నెటిజనులు అయితే సజ్జల వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఒక వేలు చంద్రబాబువైపు చూపే ముందు మూడు వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. 

స్కిల్ కేసు అంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ చేసినవన్నీ ఆరోపణలేననీ, అదే జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు జరిగిందనీ, మనీ ట్రయల్ జరిగిందన్న ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థలు చూపాయని గుర్తు చేస్తున్నారు.   పదేళ్లుగా బెయిల్‌పైనే ఎందుకు తిరుగుతున్నారని నెటిజనులు నిలదీస్తున్నారు.

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని జడ్జి నమ్మినందుకే, ఆయనకు రిమాండ్‌ విధించారన్న సజ్జల మాటలు నిజమైతే… జగన్‌ కూడా అవినీతికి పాల్పడ్డారని కోర్టు నమ్మినందుకే, ఆయనను 16 నెలలపాటు రిమాండ్‌లో ఉంచిందా అని నిలదీస్తున్నారు. 

జగన్‌పై 38 కేసులుంటే.. దానిపై కోర్టులో 54 డిశ్చార్జి పిటిషన్లు వేశారు. 158 స్టే పిటిషన్లు వేశారు. మరి సజ్జల చెప్పినట్లు జగన్‌ కూడా నిర్దోషి అయితే, ఇన్నేసి పిటిషన్లు వేయడం ఎందుకు జైల్లో ఉండి తాను నిర్దోషినని రుజువుచేసుకుని, తుది తీర్పు వచ్చిన తర్వాత పులుకడి గిన ముత్యం మాదిరిగా బయటకు రావచ్చు కదా?  అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్య సలహాదారు అయి ఉండీ ఆ సలహా జగన్ కు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు.   పనిలో పనిగా జగన్ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.  ఇంతకూ కోర్టులో తాను నిర్దోషినని రుజువుచేసుకోవాలన్న సజ్జల సలహా  చంద్రబాబుకు ఇచ్చినట్లా, లేక జగన్ కు ఇచ్చినట్లా అని ప్రశ్నిస్తున్నారు. 

పదేళ్లుగా జనం బెయిలుపై ఉన్నారన్న సంగతి కొద్ది మందిని మినహాయిస్తే జనం పెద్దగా గుర్తుంచుకున్నట్లు కనిపించదు. ఆయన పాలనా వైఫల్యాలపైనే జనాగ్రహం ఉంది. ఆయనపై కేసులు, ఆయన బెయిలపై పదేళ్లుగా విచారణకు హాజరుకాకుండా ఉన్నారన్న విషయం జనానికి పెద్దగా గుర్తు లేదనే భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్య సలహాదారు విపక్ష నేతకు ఇచ్చిన  అమూల్యమైన సలహాల కారణంగా జనం జగన్ కేసులు, బెయిలు విషయాన్ని గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలను అంతర్జాలంలో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యసలహాదారు ఆ విషయాలన్నిటినీ గుర్తు చేసి జగన్ ను మరో సారి జనం ముందు దోషిగా నిలబెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.