posted on Oct 20, 2023 2:29PM
ప్రవళిక ఆత్మహత్య చూట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న కొద్ది సేపటికే ఆమె బస చేస్తున్న హస్టల్ ప్రాంగణంలో తల్లి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన తెలంగాణ సర్కార్ ప్రవళిక కుటుంబంను ప్రగతి భవన్ కు పిలిపించుకుంది. ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ స్వంత చానల్ కు ఆమె తల్లి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ప్రగతి భవన్లో ఇచ్చిన ఇంటర్వ్యూకు పరస్పరం విరుద్దంగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మంత్రులను సైతం అనుమతించని కెసీఆర్ ప్రవళిక కుటుంబాన్ని ప్రగతిభవన్ కు హడావిడిగా పిలిపించుకుని ఏం చర్చలు జరిపినట్టు అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. నేరుగా కెసీఆర్, కెటీఆర్ ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సోషల్ మీడియా కోడైకూస్తుంది. ఏ ఒక్క చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. కాలర్ మైక్ లో తల్లి స్టేట్ మెంట్ రికార్డు చేసి అధికార పార్టీ చానెల్ లో ప్రసారం చేసింది ప్రభుత్వం. ఇంటర్వ్యూ సమయంలో అధికార పార్టీ స్వంత చానల్ లోగో కనబడకుండా ప్రసారం చేయడం గమనార్హం. ఇదే రికార్డ్ ఫుటేజిని ప్రభుత్వం అన్ని చానల్స్ , యూట్యూబ్ చానల్స్ కు విడుదల చేసింది.
ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడానికి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడమేనని ఆమె తల్లి అన్ని చానల్స్ , పత్రికలకు ఆత్మహత్య చేసుకున్న రోజు చెప్పారు. ఇంతలో రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ ములుగు సభకు రానున్నట్లు తెలిసి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవళిక అన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆశ చూపింది. గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ప్రభుత్వానికి ముందే తెలుసు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని తెలిసే గ్రూప్ 2 పరీక్షలు అనౌన్స్ చేసింది. ఎన్నికల కోడ్ అమలు కావడంతో టీఎస్ పిఎస్ సి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను ఎగ్గొట్టడానికే డ్రామా ఆడినట్లు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కూలినాలి చేసుకునే ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. కానీ మంత్రి కెటీఆర్ ప్రవళిక ఆత్మహత్య కు గ్రూప్ 2 పరీక్షలు కారణం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఆమె ఎలాంటి కాంపిటేటివ్ పరీక్షలకు హజరు కాలేదని అబద్దాలు చెప్పారు. గ్రూప్ 2 పరీక్షలకు కనీసం అప్లయ్ కూడా చేసుకోలేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కానీ రాజకీయం చేస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్లయ్ చేయకపోతే ప్రవళిక కు హాల్ టికెట్ నెంబర్ ఎలా వచ్చింది అని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా కెటీఆర్ స్టేట్ మెంట్ ప్రవళిక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఉంది. ప్రవళిక కు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు, అతను వేధించడం వల్లే ఆత్మ హత్య చేసుకున్నట్లు కెటీఆర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. బాయ్ ఫ్రెండ్ వేధించడం వల్లే ప్రవళిక ఆత్మ హత్య చేసుకుందని, ఆమె ఏ ఒక్క పరీక్షకు అప్లయ్ చేసుకోలేదని తమ దర్యాప్తులో తేలిందని డిసిపి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. బాయ్ ఫ్రెండ్ వేధించడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ వైపు కెటీఆర్, డిసిపి చెబుతూనే ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆశ పెట్టడం అంటే ప్రభుత్వం తన తప్పును అంగీకరించినట్లేనని అర్థం చేసుకోవాలి. గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల లీక్ తో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల అగ్రహానికి గురైంది. తెలంగాణ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్ చేరుకుని వివిధ కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు చెల్లించి కోచింగ్ తీసుకుంటుంది. గ్రూప్ వన్ పరీక్షతో సహా మిగతా పరీక్షలు వాయిదా పడటంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనైంది. ఏ ముఖం పెట్టుకుని స్వంత గ్రామాలకు వెళ్లాలి అనేది వారి ప్రశ్న. ప్రవళిక విషయంలో అదే జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రోజు ప్రవళిక తన తల్లికి ఫోన్ చేసి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. పరీక్షలు వద్దు గిరీక్షలు వద్దు ఇంటికి వచ్చేయ్ అని తల్లి ఫోన్ లో చెప్పినప్పటికీ ఇక్కడే చిన్న ఉద్యోగం దొరికింది. హస్టల్ ఫీజు తానే కట్టుకుని మళ్లీ పరీక్షలకు హాజరవుతానని చెప్పింది. కూలీ నాలీ చేసి బిడ్డ హాస్టల్ ఫీజు కట్టే తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాళనుకుంది ప్రవళిక. 15 కిలో మీటర్ల దూరం వెళ్లి ఉద్యోగం చేయడాన్ని తల్లి దండ్రులు వారించారు. బిడ్డ క్షేమం దృష్ట్యా వాళ్లు వారించి ఉండవచ్చు. కానీ గ్రూప్ 2 పరీక్షల వాయిదాతో ప్రవళిక తీవ్ర డిప్రెషన్ కు గురైంది. అదే రోజు తాను చిక్కడపల్లిలో ఉంటున్న హాస్టల్ లోనే ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులకు తీరని వేదనకు గురి చేసింది. ఒక్క గ్రూప్ 2 పరీక్ష కు మాత్రమే కాదు ఏ పరీక్ష కు హాజరు కాకుండా ప్రవళిక తిరిగి రాని లోకాలకు చేరుకుంది. యావత్ తెలంగాణ ప్రజలు ఈ సంఘటనకు చలించిపోయారు.
ప్రభుత్వ వ్యతిరేకత నిరుద్యోగ యువతలో బాగా పెరిగిపోయింది. ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే ములుగు సభలో కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. ప్రతీ సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు హామీ ఇచ్చిం. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వారిని ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సిక్స్ గ్యారెంటీస్ తో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాంచి ఊపు మీద ఉంది. ప్రజల్లో దూసుకెళ్తుంది. వివిధ సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్య బిఆర్ఎస్ ప్రభుత్వం చెడ్డ పేరు మూటగట్టుకుంది.