ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ ఏపీపై చర్యలకు గవర్నర్ ఆదేశం! | governer directs home secratary to take action| ap| cid| chief| aditional| ag| pressmeet| cases| babu
posted on Oct 21, 2023 6:48AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిన విషయం.. ఆ తరువాత విచారణ, రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ బాబు జరుపుతున్న న్యాయపోరాటం అందరికీ తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అలాగే సైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ కేసులో తీర్పు వెలువరించిన తరువాతనే మిగిలిన విషయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఒక వేళ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తే చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయన్నది న్యాయనిపుణుల విశ్లేషణ. అలాగే క్వాష్ పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టులోబాబు తరఫు న్యాయవాదుల వాదనలే ఎఫెక్టివ్ గా ఉన్నాయనీ, ఈ కేసులో జగన్ సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ.. వాయిదాల కోసమే వాదిస్తున్నారన్న అభిప్రాయం కూడా న్యాయనిపుణులలో వ్యక్తం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ కేసులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పర్యవేక్షిస్తున్నారు, ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులలో వాదిస్తున్నారు. అయితే కేవలం ఉద్యోగ ధర్మానికి పరిమితం కాకుండా వారు ఒకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారనీ, ఊరూరా తిరిగి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ కేసుల గురించి మాట్లాడుతున్నారనీ వారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మీడియా సమావేశాలలో కోర్టులలో విచారణలో ఉన్న కేసులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఒక్క ఆయనే కాదు.. ఇంకా లోకేష్ సహా పలువురిని కూడా అరెస్టు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఈ కేసులలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితరుల అవినీతికి సంబంధించి బలమైన సాక్ష్యాధారాలున్నాయని వారు మీడియాకు చెప్పారు.
తాము చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని రాజకీయ కక్ష సాధింపు సరికాదంటూ రాజకీయ ప్రసంగాలు చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి జగన్ ప్రభుత్వం ఈ అక్రమకేసులు బనాయించి తమపై ఏవిదంగా రాజకీయ కక్షలకు పాల్పడుతోందో వివరించడంతో జగన్ ప్రభుత్వం తరఫున ఏపీసీఐడీ చీఫ్ సజయ్, అడిషనల్ ఏజీ పొన్నవోలు ఢిల్లీ వెళ్లి కౌంటర్లు ఇచ్చి వచ్చారు. అయితే నారా లోకేష్ జాతీయ మీడియా ముందు జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోందని చెప్పడం..
మూడు కోర్టులలో ఈ కేసుల విచారణ కొనసాగుతున్నప్పుడు, వాటిని పర్యవేక్షిస్తున్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, వాదిస్తున్న పొన్నవోలు ప్రెస్‌మీట్ పెట్టి కేసులపై మాట్లాడడాన్ని ఒకే గాటన చూడలేం. కోర్టులు కేసులను విచారిస్తునప్పుడు వాటిని ప్రభావితం చేసేవిధంగా ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనగర్ మీడియాకు చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది. వారి ఉద్యోగ ధర్మాన్ని ఉల్లంగించడమే ఔతుంది. ఇదే విషయంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ యునైటడ్ ఫోరం ఫర్ కాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోమ్ కార్యదర్శిని ఆదేశించారు.
గతంలో తెలంగాణలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మరీ వివరాలు వెల్లడించారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను మందలించింది. కోర్టుకు మాత్రమే తెలియజేయాల్సిన వివరాలు సీఎంకు ఎలా తెలిశాయని నిలదీసింది. అంతే కాకుండా కేసునే రద్దు చేసింది. చంద్రబాబు స్కిల్ కేసులో కూడా ఏపీసీఐడీ, అడిషనల్ ఏజీ కోర్టుకు తెలియజేయాల్సిన విషయాలను మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ బహిరంగంగా వెల్లడిస్తుండటం కూడా ఆ కోవలోకే వస్తుంది. దీనిపైనే గవర్నర్ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీ హెోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.