చంద్రబాబు ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు.. వెగటు పుట్టిస్తున్న వైసీపీ తీరు! | people aversion towards ycp| cruality| babu| health| comments| sajjala| advisor| jail| checkup
posted on Oct 21, 2023 10:30AM
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత జరుగతున్న సంఘటనలు గమనిస్తే చంద్రబాబును వీలైనంత ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అందుకే చంద్రబాబు ప్రమేయమే లేని స్కిల్ కేసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా ఒకదాని తరువాత ఒకటిగా అక్రమ కేసులను తెరమీదకు తెచ్చి.. పీటీ వారెంట్లతో హడావుడి చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేమన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆయన ప్రజలలో తిరిగే అవకాశం లేకుండా చేయాలన్న దుష్టతలంపుతోనే అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు. అయితే అక్రమ అరెస్టుతో కూడా ఏ మాత్రం ధైర్యం కోల్పోని చంద్రబాబు.. తనపై కేసు అక్రమమనీ, దానిని కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
వాస్తవానికి చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన కేసులో ఆయన క్వాష్ కాకుండా బెయిలు పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేసే వారు. కానీ.. జగన్ సర్కార్ దుష్ట తలంపును అర్ధం చేసుకున్న ఆయన ఒక కేసులో బెయిలు పొందగానే మరో కేసు.. ఆ తరువాత ఇంకో కేసు అంటూ వేధిస్తారని, అసలు ఆ కేసులలో పస లేదనీ, కేవలం రాజకీయ వేధింపులేనని తేల్చేసేందుకే సిద్ధపడ్డారు.
న్యాయస్థానాలలో విజయం సాధించి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని అందుకే ఆయన కోర్టులలో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా నిబ్బరంగా ఉన్నారని అంటున్నారు.
అయితే రాజమహేంద్రవరం జైలులో పరిస్థితులు, జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకు జైలులో ఏదైనా హాని తలపెడతారన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. ఆయన విపరీతమైన ఉక్కపోతకు గురై డీహైడ్రేషన్ కు గురైన సందర్భంలోనూ, ఉక్కపోత కారణంగా అ లర్జీ వచ్చి అనారోగ్యానికి గురైనా సరైన వైద్య సహాయం అందించకపోవడం వంటి సంఘటనలతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుకు హాని తలపెట్టాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా జైలులో ఉండగా అనారోగ్యానికి గురైతే.. ఆసుపత్రికి తరలించడం కద్దు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించకుండా జైలుకే ప్రభుత్వ వైద్యులను రప్పించడం, అలాగే ఆయనకు చేసిన పరీక్షలు, చికిత్స, అందించిన మందుల విషయాలను గోప్యంగా ఉంచడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
సొంత బాబాయ్ వివేకా హత్య కేసులో కేసులో సొంత కుటుంబ సభ్యులే జగన్ వైపు వేలెత్తి చూపడం, కన్నతండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి పదివి కోసం ఆయన చేసిన ‘సంతకాల’ ప్రయత్నం, రాజకీయంగా తల్లీ, చెల్లి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు గుర్తు చేస్తూ.. అధికారం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడని జగన్ రెడ్డి, ఇప్పుడు అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబుకు హాని తలపెట్టినా తలపెడతారన్న అనుమానాలు సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు, చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, కొందరు మంత్రులు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలను గమనిస్తే.. ఆ అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.
చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే,ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఇంత వరకూ కనీసం స్పందించని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికలపై విశ్వాసం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్’ను పిలిపించుకుని చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగితెలుసు కున్నారు.అలాగే, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్’ను చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకుంటే.. పార్లమెంట్ -20 సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ తెలుగుదేశం ఎంపీ కనకమేడలను చంద్రబాబు ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు.
ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంటే ఒక్క వైసీపీ నాయకులు మాత్రం మానవత్వాన్ని మరిచి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరుగు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాత్రం చంద్రబాబు జైల్లో బరువు తగ్గలేదు సరికదా ఒక కిలో బరువు పెరిగారని వ్యంగ్య వ్యాఖ్యలు చేసశారు. చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందంటూ చౌకబారు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల వయసున్న నాయకుడి ఆరోగ్యంపైనా అవహేళనగా మాట్లాడి తమ తీరు ఎంత నేలబారుగా ఉంటుందో మరో సారి రుజువు చేసుకున్నారు.
చంద్రబాబుకు వయసు రీత్యానే కాదు, 35 సంవత్సరాలకు పైగా ఉన్న చర్మ ఆరోగ్య సమస్య రీత్యా ప్రత్యేక వైద్యం, ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఆరోగ్య అవసరాల దృష్ట్యా చల్లటి వాతావరణం (ఏసీ) లో ఉండటం అవసరం. జైల్లో ఆ సదుపాయం లేదు. కోర్టు ఆదేశించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ సౌకర్యం కల్పించారనుకోండి అది వేరే విషయం. అయితే స్కిన్ అలర్జీతో ప్రాణాలు పోతాయా? వంటి దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతల పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. హెల్త్ బులిటిన్ విడుదల చేయాలన్న డిమాండ్ పైనా సజ్జల చేసిన నీచమైన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఏహ్యత వ్యక్తం అవుతున్నది. అధికార దర్పంతో సభ్యత, సంస్కారం మరిచి వ్యవహరించే నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నది చరిత్ర పదే పదే రుజువు చేస్తున్న సత్యం. అధికార మదంతో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.