Leading News Portal in Telugu

ఏపీ హేట్స్ జగన్!.. తెలుగుదేశం కొత్త స్లోగన్ | ap hates jagan| telugudesham| programme| party| cadre| people| ycp| babu| arrest


posted on Oct 21, 2023 1:36PM

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే  రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎవరికి వారు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలైతే రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కారక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు.

నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కోసం తీసుకోచ్చిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని విమరిస్తూ మరోసారి రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి మంత్రుల వరకూ.. పూర్తి స్థాయిలో క్యాడర్ ను కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే వైసీపీ పెద్దలు పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే దీనికి కౌంటర్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే జనసేన ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లనున్నది. 

ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూడా  ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.    వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు ఏపీ హేట్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. నాలుగున్నరేళ్ల జగన్ సర్కార్ లో ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, నెరవేరని హామీలను, కక్షపూరిత పాలన, ప్రణాళికలు లేని నిర్ణయాలపై  విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. తాజాగా ఏపీ హేట్స్ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో అంటున్నారని  ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, బినామీలు సృష్టించిన కంపెనీల మద్యంతో రాష్ట్రంలో 30 వేల మందిని చంపేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, విద్యుత్‌ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని హామీలు జగన్ నెరవేర్చ లేదని, సీపీఎస్‌ రద్దు, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్ మాట తప్పారని గుర్తు చేశారు.

నిజానికి ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పార్టీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టై 43 రోజులు అయ్యింది. కోర్టులలో వాయిదాల మీద  వాయిదాలు పడుతున్నాయి.  ఆయన ఎప్పుడు బయటకి వస్తారో అర్ధం కావడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి అక్కడే ఉంటూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా అటు ఢిల్లీలో సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వ్యవహారాలు, లాయర్లతో భేటీలు చూసుకుంటూ ఢిల్లీ, ఏపీ మధ్య పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు.  అయినా పార్టీ నేతలు, క్యాడర్ మాత్రం దూకుడుగానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజలలో యాక్టివిటీ ఉండేలా చేస్తున్నారు. తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. 

నిజానికి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే తెలుగుదేశం నీరుగారిపోతుందనీ, అధినేత అరెస్టుతో ఆవేదనతో చేష్టలుడిగి నిస్తేజంగా ఉండిపోతుందని వైసీపీ మరీ ముఖ్యంగా జగన్ భావించారు. అయితే అందుకు భిన్నంగా తెలుగుదేశం రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు, వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో తెగించి మరీ రోడ్డుమీదకు వస్తున్న తీరు అధికార పార్టీ అగ్రనేతలకు మింగుడు పడటంలేదు. తెలుగుదేశం దూకుడుకు బ్రేకులు వేయవచ్చని భావించి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణులు అనూహ్యంగా గతానికి మించి యాక్టివ్ అయ్యాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.   తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెడుతున్నారు.  అలాగే ఇప్పుడు ఏపీ హేట్స్ జగన్ అంటూ పార్టీ రూపొందించిన కార్యక్రమంతో మరింత ఉత్సాహంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.