లోకేష్, పవన్ భేటీ.. ఇక బొమ్మ దద్దరిల్లిపోతుంది! | lokesh pawan meet| telugudesham| janasena| alliance| combined
posted on Oct 22, 2023 4:13PM
సమయం లేదు మిత్రమా.. ఇక రణమే అంటూ ఎన్నికలకు సిద్దమైపోతున్నాయి ఏపీలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం,జనసేన. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ఏపీలో జగన్ ఓటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకూ ఉంటుందా.. ఉండదా అన్న అనుమానాల మధ్య ఊగిసలాడుతున్న తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖరారైపోయింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు ఉంటుందని పై ప్రకటన చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం, జనసేన కలిసే పోటీచేస్తాయని విస్పష్టంగా తేల్చేశారు. దీంతో రెండు పార్టీలలో జోష్ పెరిగింది. త్వరలోనే రెండు పార్టీల నేతలు కలిసి చర్చించి జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటిస్తామని నేతలు చెప్పారు. ఇప్పటికే రెండు పార్టీల నుండి ఈ కమిటీ కోసం నేతల ఎంపిక కూడా పూర్తయ్యింది. ఇకపై రెండు పార్టీలు కలిసే ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించనున్నారు .
పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేసినపుడే త్వరలోనే చంద్రబాబు జైలు నుండి బయటకి వస్తారని, ఆ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య చర్చలు ఉంటాయని అనుకున్నారు. కానీ, నలభై రోజులు దాటిపోయినా చంద్రబాబు కేసులో తీర్పు రాలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడడానికి మరి కొన్ని రోజులు.. అంటే కోర్టుల దసరా సెలవుల పూర్తయిన తరువాత వెలువడే అకాశం ఉండటంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పుడు రెండు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు. ముందుగా రెండు పార్టీల కమిటీలు సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తదుపరి కార్యాచరణపై చర్చించబోతున్నాయి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో జనసేన కమిటీకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించబోతున్నారు. ముందుగా నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చినా.. ఇప్పుడు పవన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం నుండి నారా లోకేష్ నాయకత్వం వహించబోతున్నారు. ఇక ఈ భేటీకి ముందు లేదా తర్వాత చంద్రబాబుతో లోకేష్, పవన్ లు ములాఖత్ ద్వారా భేటీ కానున్నట్లు చెబుతున్నారు.
ఒక్కసారి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటన వస్తే.. ఇహ అప్పటి నుంచీ నిత్యం రెండు పార్టీలు ప్రజల మధ్యనే ఉండనున్నాయి. ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్‌ని నవంబరు 1 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం వచ్చే వారం మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్రణాళిక రూపొందించింది. `నిజం గెలవాలి` అంటూ భువనేశ్వరి, `భవిష్యత్ గ్యారెంటీ` ప్రోగ్రామ్‌తో నారా లోకేష్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా, ఈ రెండు కార్యక్రమాలకీ జనసేన నేతలు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చే అవకాశం ఉంది. అలాగే, నవంబరు మొదటి వారంలో పవన్ తదుపరి విడత వారాహి యాత్ర మొదలు కానుంది. ఈ యాత్రకి టీడీపీ మద్దతు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఐక్యంగానే కదులుతున్న సంగతి తెలిసిందే. ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగేలా మొత్తం వ్యవహారాల్ని జాయింట్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కదలనున్నాయి.
మొత్తంగా రానున్న రోజుల్లో రాష్ట్రం అంతటా ప్రతిపక్షాల జోరు, దూకుడు కనిపించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఇరు పార్టీల నేతలూ చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించి నలభై రోజుల అయినప్పటికీ ఇప్పటి వరకూ రెండు పార్టీలూ కలిసి చేపట్టిన కార్యక్రమాలు లేవు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు మద్దతు ప్రకటించడం సరే.. ఉమ్మడిగా కలిసి పనిచేసింది లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరగబోయే రెండు పార్టీల భేటీ ఉమ్మడి కార్యాచరణకు నాంది కాబోతున్నది. రాజహేంద్రవరంలో సోమవారం (అక్టోబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్, లోకేష్ ల అధ్యక్షతన ఇరుపార్టీలూ ఉమ్మడిగా తొలిసారి సమావేశం కానున్నాయి. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. ఒక్కసారి ఈ ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే ఇక రాష్ట్రంలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని తెలుగుదేశం, జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.