Leading News Portal in Telugu

ఏపీలో పనితనం లేదు పగతనం ఉంది.. జగన్‌పై మరోసారి హరీష్ రావు సెటైర్లు! | harishrao satires on jagan| no| work| only| grudge| telangana


posted on Oct 23, 2023 6:18AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తెలుగు రాష్ట్రాలలో కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క ఏపీలో మాత్రమే కాదు.. ఇప్పుడు తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్ బిగ్ ఇష్యు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలో ఇది రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ అంశమే తెలంగాణ రాజకీయాలలో కూడా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అయింది. చంద్రబాబు అరెస్టు సమయంలో అన్ని పార్టీల నేతలు స్పందించి ఖండించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టుపై స్పందించి ఖండించారు. బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ స్పందించలేదు  కానీ.. బీఆర్ఎస్ లో మిగతా మంత్రులు ఈ అంశంపై స్పందించి ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ముఖ్యంగా మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలకు వైసీపీ నేతలలో కనీస చలనం  లేదు.

బీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి హరీష్ రావు మొదట నుండి చంద్రబాబు నాయుడు అరెస్టును తప్పు బడుతూనే ఉన్నారు. మూడు వారాల క్రితం స్పందించిన ఆయన చంద్రబాబును అరెస్ట్ చేసి ఉండకూడదన్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం ముమ్మాటికీ తప్పే అని.. ఇది పూర్తిగా బీజేపీ, వైసీపీల కుట్ర రాజకీయం అని కూడా విమర్శించారు. తెలంగాణ నేతలు ఈ స్థాయిలో విమర్శిస్తున్నా.. ఏపీ వైసీపీ నేతలు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. కాగా, ఇప్పుడు మరోసారి హరీష్ రావు చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసలు పనితనం లేదు.. కేవలం పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలులో ఉండేవారని.. కానీ తాము ఎవరి మీదా పగ పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

హరీష్ రావు ఏపీలో కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టడాన్ని ఆయన పగతనంగా చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో పనితనం లేదని..  పగతనం మాత్రమే ఉందని హరీష్ రావు విస్పష్టంగా చెప్పారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ యధాలాపంగా చేశారో.. ముందే అనుకోని చేశారో కానీ.. కేసీఆర్, జగన్ లను ముడిపెట్టి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను కలుపుతూ చేసిన ఈ వ్యాఖలు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐదేళ్ల తమ పాలనలో రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామన్న ఆవేదన హరీష్ రావు మాటలలో కనిపిస్తున్నదని కొందరి అంటుంటే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలాగా తాము రాజకీయాలలో పగను చూడమని, వ్యక్తిగతంగా పగబట్టమనే హరీష్ రావు మాటలకు అర్ధంగా మరికొందరు   భావిస్తున్నారు.

అ యితే, అసలు ఇప్పుడు హరీష్ రావు మరోసారి చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే తెలియనిదేమీ కాదు. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు సానుభూతిపరుల ఓట్లు బీఆర్ఎస్ కు ఇప్పుడు అవసరం. అందుకే బీఆర్ఎస్ నేతలు వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. పనిలో పనిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని, ఆయన పాలనను వేలెత్తి చూపుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో నిరసనలను కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నది. అడ్డుకుంటున్నది. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, ఆ తర్వాత అదే కేటీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్ చేసిన ట్వీట్ కు స్పందించి సానుభూతి తెలిపారు. ఖమ్మంలో చంద్రబాబు పాలన ప్రస్తావన తెచ్చి కీర్తించారు. అదే దారిలో తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు ప్రస్తావన తెచ్చి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు సైతం జగన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతున్నా వైసీపీ నేతలు తేలు కుట్టిన దొంగలాగా  మౌనంగా ఉంటున్నారు.