Leading News Portal in Telugu

కొట్లాడి తెచ్చిన తెలంగాణ.. కేసీఆర్ ఎమోషన్ పని చేసేనా? | kcr telangana emotion does not workout| congress| trs| name| change| brs| government


posted on Oct 23, 2023 10:49AM

తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టిన ఘనుడు కల్వకుంట చంద్రశేఖర రావు. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణ ప్రజల మనసు లోతులను కొలిచి.. అందులో రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న  టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీ. అందుకే ఎవరెన్ని మాట్లాడినా.. ప్రజలను ఎంతగా తమ వైపుకు తిప్పుకున్నా.. ఒక్కసారి కేసీఆర్ మైక్ అందుకుంటే ప్రజలంతా తన గురించి మాట్లాడుకొనేలా చేసుకోగలరు. ఇప్పటి వరకూ తెలంగాణలో జరిగింది ఇదే. ఒకవైపు రాజకీయంగా తన ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బ తీస్తూనే.. ప్రజల నాడీని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రసంగాలు చేస్తూ వచ్చారు.   దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉన్నా మాటలతోనే ప్రజలను బోల్తా కొట్టించి కారు ఎక్కించుకొని అసెంబ్లీకి వెళ్లేవారు. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు విజయవంతంగా అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ క్రమంలో ఆయన  ఆ సమయానికి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఒక అంశాన్ని టేకప్ చేసుకొని అందులోనే సెంటిమెంట్ రగిలించి ఓట్లుగా మలచుకునే వారు. గత రెండు ఎన్నికలలో కేసీఆర్ అదే చేశారు. ముఖ్యంగా తెలంగాణ స్వాభిమానం పేరిటే ఇంత వరకూ కేసీఆర్ ఎన్నికల రాజకీయం అంతా నడిచింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంటును, ఆంధ్రా నేతల పాలనను తెరమీదకి తెచ్చి.. ఓటర్ల గుండెల్లో అగ్గిపుట్టించే వారు. తెలంగాణ రాష్ట్రం ఊరికే అచ్చిందా .. చావు నోట్లో తలబెట్టి తెచ్చిన.. ఊరికే ఇచ్చిన్రా రాష్ట్రం.. ఆగమాగం జేస్తే ఇచ్చిన్రు. సోయ లేకుండా నిర్ణయాలు తీసుకోకన్రి.. ఇంకా ఈ ఆంధ్రోళ్లు మన నెత్తిన అవసరమా.. ఇంకా మనం ఢిల్లీ ఎళ్లి గులాంగిరి జేయాల్నా.. జెర ఆలోచించుర్రి లాంటి మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే వారు. ఎన్నికలు ఏవైనా సరే కనీసం ఒక్కసారైనా తెలంగాణ తెచ్చింది నేనే అనే మాట లేకుండా కేసీఆర్ ప్రసంగాలు ఉండవు. ఇక, ఆ పార్టీ నేతలైతే తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ అనే రేంజిలో ఎలివేషన్స్ ఇస్తారు. ఒక ధంగా తెలంగాణ అనే ఎమోషన్ మీదనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గండం నుండి గట్టెక్కుతూ వస్తుంది. 

అయితే, ఈసారి ఈ తెలంగాణ ఎమోషన్ కేసీఆర్ ను గెలిపిస్తుందా అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. గత రెండుసార్లు కాంగ్రెస్ పరిస్థితి వేరు.  ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది.  తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.  తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ బలంగా ప్రజలలోకి చొచ్చుకుపోయింది. చొచ్చుకుపోతోంది. అస‌లు సోనియా ప్రత్యక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న రాజకీయ సంకల్పం తీసుకోకుండా ఉంటే తెలంగాణ వ‌చ్చేదా అంటూ ప్రజల మనసుకు హత్తుకునేలా ప్రశ్నిస్తోంది.  దీంతో తెలంగాణ  ప్రజలలో ఇదే చ‌ర్చ‌నీయాంశంగామారింది.   రెండుసార్లు తెలంగాణ తెచ్చిన వారికి అవకాశం ఇచ్చాం.. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు అసలు ఈ సెంటిమెంటే ఈసారి ఎన్నికలలో ఏ మాత్రం ఉపయోగపడదన్న భావన వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్దం అయ్యింది. అంతే కాకుండా పార్టీ పేరులోని తెలంగాణను కూడా కేసీఆర్ తీసి పారేశారు. అలాగే ఈ పదేళ్లలో ఉద్యమ నేపథ్యం ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా తాను స్వయంగా ముద్ర వేసిన నాయకులను కేసీఆర్ చేరదీశారు. దీంతో తెలంగాణ ఎమోషన్ ను ఈ సారి కేసీఆర్ పండించలేకపోవచ్చునని, అదే సమయంలో ప్రజలలో ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ చేసిందేమిటన్న ప్రశ్న బలంగా మెదులుతోందని పరిశీలకులు విశ్లేషిప్తున్నారు.   దీంతో ఈసారి తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ఎమోషన్ ను పండించలేరనీ, ఈ సారి ప్రజలు ఇచ్చే తీర్పు కేసీఆర్ పాలనపైనేననీ అంటున్నారు.