Leading News Portal in Telugu

లోకేష్, పవన్ భేటీ.. వైసీపీకి లోన వణుకు.. పైకి మేకపోతు గాంభీర్యం! | lokesh pawan meet defeat fear in ycp| rjy| manjeera| hotel| combined


posted on Oct 24, 2023 11:29AM

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచినప్పటికీ.. తెలుగుదేశం పార్టీలో జోష్ ఇసుమంతైనా తగ్గలేదు. సరికదా.. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ పతనమే లక్ష్యంగా మరింత దృఢసంకల్పంతో  కేడర్ ముందుకు సాగుతున్నది.  అతెలుగుదేశం క్యాడర్ లోనే కాదు.. తటస్థులు, సామాన్య జనంలో కూడా ఇదే భావన వ్యక్తం అవుతోంది.   మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించి  జనంలో కొత్త జోష్ నింపారు. అయితే జనసేనాని తెలుగుదేశంతోనే కలిసి వెడతామని ప్రకటించి 45 రోజులైనా.. ఆ దిశగా రెండు పార్టీల మధ్యా  ఉమ్మడి కార్యాచరణ దిశగా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో జనం ఒకింత అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. అసలు పొత్తు ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ అసహనానికీ, అనుమానాలకీ తెర దించుతూ రెండు పార్టీల పెద్దలు కలిసి ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. రాజమండ్రి మంజీరా హోటల్‌ వేదికగా సోమవారం (అక్టోబర్  23)న జరిగిన భేటీలో టీడీపీ, జనసేన నేతలు సమన్వయ కమిటీ సభ్యులతో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరిపారు.

సమన్వయ కమిటీలలో ఇరు పార్టీల నుంచి ఆరుగురు చొప్పున సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల సమన్వయ కమిటీలతో  నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించారు. గ్రామీణ స్థాయిలో పార్టీల బలోపేతం, ప్రజలకు చేరువ అయ్యే కార్యక్రమాలు, క్షేత్రస్థాయికి పొత్తు అంశాన్ని బలంగా తీసుకెళ్లడంపై చర్చించారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరాక నిర్వహించిన తొలి సమావేశం ఇదే .   45 రోజులుగా చంద్రబాబు నిర్బంధంలో ఉన్న రాజమహేంద్రవరంమే రెండు పార్టీల భేటీకి అక్కడే వేదిక కావడం కాకతాళీయం ఎంత మాత్రం కాదు. ముందుగా నారా లోకేష్ రాజమండ్రి తెలుగుదేశం క్యాంపు కార్యాలయంలో పార్టీ  సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కళ్యాణ్ తో  భేటీ అయ్యారు.  

కాగా, సమన్వయ కమిటీలతో భేటీ అయ్యాక నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతకు ముందే  సోమవారం (అక్టోబర్ 10) ఉదయమే  నారా లోకేష్ చంద్రబాబును ములాఖత్ లో కలిసి చర్చించారు.. పలు అంశాలపై సూచనలు తీసుకున్నారు. ఆ తర్వాత సమన్వయ కమిటీ భేటీ.. అనంతరం పవన్-లోకేష్ ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పవన్, లోకేష్ భేటీతో తెలుగుదేశం, జనసేన నాయకులలో జోష్ పెరిగింది. అంతకు మించి  వైసీపీ నాయకులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన పెరిగిపోయింది. ఈ సమావేశంతో  ఏపీ రాజకీయాలలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇరు పార్టీలూ వేరువేరుగా అంటే పొత్తు లేకుండా ఉన్నసమసయంలోనే వైసీపీ పట్ల వ్యతిరేకత పీక్స్ లో ఉంది. అయితే జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. గుడ్డిలో మెల్ల అన్నట్లుగానైనా గెలుస్తామన్న ఆశ వైసీపీలో మిణుకు మిణుకు మంటుండేది. అయితే   రెండు పార్టీలూ కలిసి రంగంలోకి దిగితే.. సోదిలోకి కూడా మిగలం అన్న ఆందోళనతోనే వైసీపీ నేతలు ఇరు పార్టీల మధ్యా పొత్తు లేకుండా చేయడానికి నానా విధాలుగా  ప్రయత్నించారు. ఒంటరి పోరు.. దమ్ము అంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇరు పార్టీలూ జగన్ ను గద్దెదించాలన్న ప్రజల ఆకాంక్షను సాకారం చేయడమే లక్ష్యం అంటూ కలిసే పోటీలో దిగడానికి సిద్ధం అవ్వడంతో  వైసీపీ వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు.  

ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ  నాదశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ  తెలుగుదేశం. క్షేత్రస్థాయి నుండి బూత్ స్థాయి వరకూ నాయకత్వం, నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదార్శనికుడు, దార్శనికుడు చంద్రబాబు సారధ్యంలో సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలచుకోవడం అలవాటుగా మార్చుకున్న పార్టీ తెలుగుదేశం. ఇక పవన్ కళ్యాణ్ కున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, సినీ గ్లామర్ జనసేనకు ప్రధాన ఆకర్షణ. అన్నిటికీ మించి ప్రజలలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, వ్యతిరేకత, ప్రజాగ్రహం కూడా తోడై ఈసారి వైసీపీకి ఘోర పరాజయం తప్పదేనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. వాళ్లలోనూ, వీళ్లలోనూ కాదు.. ఏకంగా వైసీపీ శ్రేణులలోనే ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీలోని కొందరు సీనియర్ నాయకులు, మంత్రులూ కూడా అంతర్గత సంభాషణల్లో, తమ అనుచరులతో భేటీలలో ఈ విషయాన్నే చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం (అక్టోబర్ 23) జరిగిన లోకేష్, పవన్ భేటీ  వైసీపీలో అలజడి పెరిగింది. భయం మొదలైంది. ఇప్పటికే సర్వేల ఫలితాలను, ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ చూసిన వైసీపీ నేతలకు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది.  పైకి మేకపోతు గాంభీర్యం పదర్శిస్తున్నా ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి సహా.. వైసీపీ పెద్దలను కూడా  తెలుగుదేశం, జనసేన పొత్తు కలవరపెడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.