వైసీపీ సామాజిక బస్సు యాత్ర.. తిరుగుబాటుకు ప్రజలు సిద్ధం! | ycp to kick start bus yatra| people| ready
posted on Oct 25, 2023 1:37PM
ఏపీలో ఈసారి అధికారం ఎవరిది అంటే ఇప్పటికే జనం క్లియర్ కట్గా తేల్చి చెప్పేస్తున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం తెలుగుదేశం అధికారం చేపట్టడం తథ్యం అంటూ విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతిపక్ష తెలుగుదేశం లో గెలుపు ధీమా స్పష్టంగా కనిపిస్తుంటే.. ఓటమి బెరుకు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఏదో ఒక మాయ చేసో.. మతలబు చేసో మరోసారి ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలని చూసినా ఆ పరిస్థితి కూడా చేయి దాటి పోయిందని అంటున్నారు. కుట్ర పన్ని టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. అయితే, వైసీపీ పెద్దలు మాత్రం గెలుపు మనదే అంటూ పార్టీ నేతలను, క్యాడర్ ను నమ్మించేందుకు వృధా ప్రయత్నం చేస్తున్నారు. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నమ్మిస్తున్నారు. ప్రజలకు మనం ఏం చేశామో ప్రజల వద్దకే వెళ్లి తెలియజెప్పండి అంటూ ఆదేశిస్తున్నారు.
ఇప్పటికే గడపగడపకి అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ అందరినీ ఇంటింటికి పంపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి బస్సెక్కించి ప్రతి గ్రామానికి పంపిస్తున్నారు. సామాజిక బస్సు యాత్ర పేరుతో మొదలవనున్న ఈ యాత్ర రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ సాగుతుంది. ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ ఇన్వాల్వ్ కావాలని ఆదేశించారు. ఇంకా చెప్పాలంటే పార్టీ మొత్తం కదిలేలా.. డిజైన్ చేసిన ప్రోగ్రాం ఇది. అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగి.. నాలుగున్నరేళ్లలో వాళ్లకి ఏం చేశామో చెప్పాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం (అక్టోబర్ 26) నుంచి ఏపీ వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఒకేసారి ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రా లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమ లో అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఒకేసారి ఈ యాత్ర మొదలు కానుంది. అరవై రోజులు సాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా రూపకల్పన చేశారు.
అయితే ఈ యాత్రలో కానీ, ప్రతిరోజూ జరిగే బహిరంగ సభలలో కానీ ఎక్కడా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించరు. ఆ మాటకొస్తే ఎక్కడా వైసీపీ ముఖ్యనేతలు కూడా కనిపించరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలే ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి భయంతో సగం డీలా పడిపోగా.. ద్వితీయ శ్రేణి నేతలంతా ప్రభుత్వంపై పీకల వరకూ అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది వైసీపీ ముఖ్యనేతలు కనిపిస్తేనే కాస్త వాళ్లలో కదలిక వస్తుంది. కానీ, వాళ్లనే బస్సెక్కి వెళ్ళండి అంటున్నారు. ఇప్పటికే గడపగడపకి వెళ్లిన వీళ్లు ప్రజల స్పందన ఎలా ఉందో చూసేశారు. ఇప్పుడు మరోసారి ప్రజల వద్దకు వెళ్లి మరో అవకాశం ఇవ్వాలని కోరితే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియనిదేమీ కాదు. దీంతో ఈ యాత్ర చివరి వరకూ సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ సామజిక బస్సు యాత్ర సక్సెస్ కావాలంటే ముందుగా కావాల్సింది రోడ్లు. ప్రతి గ్రామానికి బస్సు వెళ్లాలంటే రోడ్లు సక్రమంగా ఉండాలి. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్ల మీద నుండి ప్రజల వద్దకి వెళ్తే ఎదురయ్యే తొలి ప్రశ్న అదే అవుతుంది. గ్రామాల నుండి పట్టణాల వరకూ.. గూడేల నుండి నగరాల వరకూ అడుగడుగునా సమస్యలు తాండవం చేస్తున్నాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల అసంతృప్తి ప్రజలలో పెల్లుబుకుతున్నది. సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలిచ్చి అమలు చేయని అంశాలు, నాలుగేళ్లుగా మాటలే తప్ప అడుగు ముందుకు పడని ప్రాజెక్టులు లాంటి ఎన్నో అంశాలతో ప్రజలలో ఆగ్రహాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు పాలకులు వెళ్తే ఏ స్థాయిలో రియాక్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సామజిక బస్సు యాత్ర వైసీపీకి ఏ స్థాయి రియాక్షన్ ఎదుర్కొంటుందో చూడాలి.