Leading News Portal in Telugu

పింఛన్ కు ఓటర్ ఐడీ కార్డుకూ లింకేంటి? | what is the link between penssion and voter id| jagan| sarkar| new| condition| go| socialmedia| ward| grama


posted on Oct 26, 2023 11:53AM

జగన్ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడానికి లబ్ధిదారులను బెదరించడానికి రెడీ అయ్యిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాలలో  వేల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేయించడమే కాకుండా, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ విషయంపై ఈసీ దృష్టి పెట్టింది. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయంలో అక్రమార్కులకు సహకరించిన అధికారులపై వేటు కూడా వేసింది. జనం తన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారని నిర్ధారణకు వచ్చేసిన వైసీపీ దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం చేతిలో ఉన్న అధికారాన్ని ఏ స్థాయికైనా దుర్వినియోగం చేయడానికి వెనుకాడటం లేదు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు పై ఈసీ దృష్టి పెట్టడంతో ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడకు తెరలేపింది.

ఈ సారి సంక్షేప పథకాల లబ్ధిదారులను బెదరించడమే లక్ష్యంగా కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. అందులోనూ ముఖ్యంగా సామాజిక భద్రత పించన్ లబ్ధిదారులను టార్గెట్ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఐదారు నెలల సమయం ఉన్న ఈ తరుణంలో సామాజిక పించన్ లబ్ధిదారుల అర్హతకు ఓటరు ఐడీ కార్డుకూ లింకు పెట్టారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏదైనా సంక్షేమ పథకం లబ్ధిదారుల అర్హతకు ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకోవాలి. దానితో పాటు నివాస ధృవీకరణ కోసం ఇప్పటి వరకూ ఆధార్ సరిపోయేది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఓటర్ కార్డు, లేదా పాస్ పోర్టును తప్పని సరి చేసింది. అయితే ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నది. అసలు ఓటరు కార్డు, పాస్ పోర్టులకూ సామాజిక భద్రత పించన్ల అర్హతకు లింకేమిటన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఒక వేళ ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటే దానిని జీవో రూపంలో విడుదల చేయాలి. కానీ అలా చేయడం లేదు. కేవలం సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని అందిస్తున్నది. ఇక్కడే పించన్ల లబ్ధికి వైసీపీకే ఓటు వేయాలన్న నిబంధనను అనధికారికంగా తీసుకువచ్చినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటివరకు దరఖాస్తుదారుల వయసు, చిరునామా ధ్రువీకరించేందుకు ఆధార్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే..  ఓటర్‌ ఐడీ లేదా పాస్‌పోర్టును తప్పనిసరి చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారాన్నిపంపింది. ఎన్నికలకు మరో ఐదారు నెలల గడువు మాత్రమే ఉన్న తరుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  పింఛను లబ్ధి పేరుతో ప్రభుత్వం దరఖాస్తుదారుల ఓటరు ఐడీ నంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఉరుము లేని పిడుగులా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తెరచాటుగా పోర్టల్‌లో మార్పులు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటరు ఐడీ సేకరణ ద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం, లేదా పింఛను అందదని బెదరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నాలుగున్నరేళ్లుగా లేని  ఓటరు ఐడీ  నిబంధనను జగన్ సర్కార్ ఇప్పుడే, ఎన్నికల ముందే ఎందుకు  తీసుకువచ్చిందని విపక్షాలు నిలదీస్తున్నాయి.