అక్కడ ఈటల.. ఇక్కడ రేవంత్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనా? | revanth etala to confront kcr in kamaredy gajwel| keen| fight| trouble
posted on Oct 26, 2023 1:24PM
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సారి తాను పోటీ చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీనే ఎదుర్కోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గజ్వేల్ లో ఏ ప్రతిబంధకాలు కనిపించాయో.. నియోజకవర్గ ప్రజల కోరిక అంటూ ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా ఉన్న కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావానికి కర్త, కర్మ, క్రియా తానేనని చెప్పుకునే ఆయన ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఆ దిశగా ఆయన వచ్చే ఎన్నికల కోసం రచిస్తున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తుగడలు మాత్రం అంతగా ఫలిస్తున్నట్లుగా కనిపించదు. స్వయంగా తానే సొంత నియోజకవర్గం గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి సిద్ధపడటం ఆయనలోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నదని పరిశీలకులుఅంటున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను నిలబడతానని చాలా చాలా ముందుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అలా ఈటల ప్రకటించిన క్షణం నుంచీ గజ్వేల్ లో కేసీఆర్ విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈటల తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో అడుగులు వేసిన వ్యక్తే. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలి విడతలో ఆయన మంత్రిపదవి దక్కలేదు. మలివిడతలో ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆ శాఖ మంత్రిగా కరోనా సమయంలో ఆయన పని తీరును ప్రజలు మెచ్చారు. కానీ.. ఆయన ముక్కుసూటి తనం, మంత్రి కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగిస్తారన్న వార్తలు జోరుగా వచ్చిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఆగ్రహం కలిగించాయి. ఫలితం భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. పార్టీనుంచీ బయటకు పంపారు. ఆ సమయంలో ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈటల కాంగ్రెస్ గూటికి చేరుతారని పరిశీలకులు భావించినా.. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) కు పోటీ ఇచ్చే స్థాయిలో లేదన్న కారణంతో ఆయన తన బీజేపీ గూటికి చేరారు. తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చేయగలిగినన్ని ప్రయత్నాలు చెప్పారు. మంత్రులను, సీనియర్లనూ అందరినీ హుజూరాబాద్ లో మోహరించి దాదాపు ఓ యుద్ధమే చేశారు. అయితే అవన్నీ నిష్ఫలమై ఈటల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో సహజంగానే ఈటల కేసీఆర్ ప్రత్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీకి సిద్ధపడటం, బీజేపీ హైకమాండ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ ముందు జాగ్రత్త పడ్డారనీ, గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే అక్కడా ఆయనకు స్థిమితం లేకుండా చేయడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ కు బలమైన ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి బరిలోకి దింపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రేవంత్ కు కాంగ్రెస్ హై కమాండ్ సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు. ముందుగా రేవంత్ కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ సూచన మేరకు కామారెడ్డి నుంచి రంగంలోకి దిగుతున్నారు.
దీంతో కేసీఆర్ పోటీ చేయనున్న రెండు నియోజకవర్గాలలోనూ ఆయన గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కామారెడ్డి నుంచి ఇప్పటికే షబ్బీర్ అలీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అధిష్ఠానం ఆయనను మరో స్థానం నుంచి పోటీ చేయించడం కానీ, పార్టీ బాధ్యతలు అప్పగించడం కానీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ మెజారిటీ 5వేల ఓట్లు మాత్రమే. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయినప్పటికీ కామారెడ్డి నుంచి గంపగోవర్ధన్ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు.
ఈ సారి తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా కనిపించకపోవడం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత అధికంగా ఉండటంతో రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా కాదని రేవంత్ ను అక్కడ నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని అంటున్నారు. రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచీ కూడా పోటీ చేయనున్నారు. పరిశీలకుల విశ్లేషణ మేరకు కొడంగల్ లో ఈ సారి రేవంత్ విజయం నల్లేరు మీద బండి నడకే. కామారెడ్డిలో ఆయన పోటీ చేయడం ద్వారా కేసీఆర్ వంటి నేత.. ఆ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక వేళ కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ విజయం సాధిస్తే.. ఇక రాష్ట్ర పార్టీలో ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించేందుకు అసమ్మతి వాదులు ధైర్యం చేయలేరనీ పరిశీలకులు అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మొత్తం మీద గజ్వల్ లో ఈటల నుంచీ, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నుంచీ కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు. ఈ పరిస్థితి కచ్చితంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రచారంపై పడుతుందనీ, ఇతర నియోజకవర్గాలపై కేసీఆర్ పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితి ఉంటుందనీ, ఆయన పూర్తిగా ఈ రెండు నియోజకవర్గాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.