తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగి‘రేసు’ | congress ahead in ts election race| brs| bjp| jumpings| dissidents
posted on Oct 26, 2023 2:35PM
కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో డీలా పడ్డ బీజేపీ.. రెండు పార్టీలనూ మరింతగా ఇబ్బందులకు గురి చేసేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు సహజకవచకుండలాలుగా అంతా చెప్పే అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల నుంచి బయటపడేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సమష్టిగా ఐక్యంగా కదులుతున్న తరుణంలోనే ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ జాడ్యం అంటుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీపరిస్థితి తెలంగాణలో అత్యంత దయనీయంగా మారిపోయింది. బీజేపీలో నేతల సంఖ్యతో సమానంగా అసంతృప్తుల సంఖ్య కూడా ఉందని అంటున్నారు.
ఇతర పార్టీలనుంచి వచ్చి బీజేపీ గూటికి చేరిన వారు సహజంగానే ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతుంటారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా బీజేపీని వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటుంది. దీంతో వేరే భావజాలంతో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసం కమలం గూటికి చేరినా అక్కడ ఇమడ లేని పరిస్థితులు ఉంటాయి. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం తొలి నుంచీ పార్టీలో ఉన్నవారే ఉక్కపోతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అలాగే ఈ తొమ్మదిళ్ల కాలంలో బీజేపీలో తొలి నుంచీ ఉన్నవారి కంటే బయట నుంచి వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న వారి సంఖే ఎక్కువ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనుక కూడా ఈ బయట నుంచి వచ్చి చేరిన వారి ప్రమేయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నాటికి బలమైన నేతలతో బీజేపీ నిండిపోతుందన్న పరిశీలకుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే వారిని నిలువరించడం ఎలా అని కమలం నేతలు తలలు బద్దలు కొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మరో వైపు బీఆర్ఎస్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిటి ఇతర పార్టీలను ఖాళీ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అనుసరించిన విధానమే ఇప్పుడు ఆ పార్టీని కకావికలం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే శాసనం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ లో విధేయత కంటే ధిక్కారమే ఎక్కువగా కనిపిస్తోందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఐక్యత కనిపిస్తున్నది. సీనియర్ల మంటూ తమ భుజాలను తామే చరుచుకునే కాంగ్రెస్ వృద్ధ నేతల అసమ్మతి గళాలనూ, అసమ్మతి రాగాలనూ పార్టీ శ్రేణులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారూ మిన్నకుండక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమాయత్తం కోసం బీజేపీ, బీఆర్ఎస్ ను కసరత్తులు చేస్తుంన్నాయి. ఆ పార్టీ నేతలకు వలసల బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే.. అటువంటి ఇబ్బందులన్నిటినీ అధిగమించిన కాంగ్రెస్ మాత్రం వజయం కోసం వ్యూహాలను రచించుకుంటూ.. వాటిని పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది.