భువనేశ్వరిపై హద్దూ పద్దూ లేని రోజా విమర్శలు!? | roja calumny on bhuvanesway| jagan| ycp| minister| elections
posted on Oct 26, 2023 10:38AM
విధ్వంసానికీ.. నిర్మాణాత్మకతకు తేడా స్పష్టంగా తెలిసిపోయింది. జగన్ సర్కార్ మాత్రమే కాదు.. ఆయన నాయకత్వంలోని పార్టీ, ఆయన కేబినెట్ సహచరులు అందరిదీ ఒకే మైండ్ సెట్.. ఆత్మస్థుతి.. పరనింద. స్పష్టంగా కనిపిస్తున్న సొంత తప్పిదాలను పట్టించుకోకుండా, కనీసం ఆ తప్పులను సరిచేసుకునే ప్రయత్నం ఏమీ చేయకుండా వాటిని ఎత్తి చూపిన వారిపై మాటల దాడికి పాల్పడటంలో అధికార పార్టీ, జగన్ ప్రభుత్వం మాస్టర్ డిగ్రీ సాధించిందని చెప్పవచ్చు.
రాజకీయాలలో కనీస విలువలకు కూడా తిలోదకాలిచ్చిన జగన్ సర్కార్, ఆయన పార్టీ నేతలు తప్పులు చేస్తాం? ఎత్తి చూపిస్తే వ్యక్తిగతంగా దూషణలకు దిగుతాం అన్నట్లు వ్యవహరిస్తున్నది. తన భర్త, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయన అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రజలలోకి వెడుతున్న నారా భువనేశ్వరిపై తమకు మాత్రమే ప్రత్యేకం అనదగ్గ అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వెగటుపుట్టిస్తున్నాయి. వైసీపీలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికీ, అడ్డగోలు విమర్శలకూ ఒక ప్రత్యేక బ్యాచ్ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడం ఆలస్యం ఈ బ్యాచ్ మైకుల ముందుకు వచ్చేస్తుంది.
ఇప్పుడు కూడా అదే జరిగింది. తెలుగుదేశం అధినేత నారా భువనేశ్వరి చంద్రగిరి సభలో ప్రసంగానికి అనూహ్య స్పందన రావడం ఆలస్యం జగన్ పార్టీ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలతో, అడ్డగోలు విమర్శలతో రంగంలోకి దిగిపోయింది. తమ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారు అన్న విషయం వాళ్లకు పట్టదు. తమ అధినేతకు నచ్చితే చాలు అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. అందులోనూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటంలో ముందుండే మాజీ మంత్రి కొడాలి నాని, ప్రస్తుత మంత్రి రోజాలు అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు విమర్శలలో సిద్ధహస్తులు అని రాజకీయవర్గాలలో పెద్ద టాక్ నడుస్తోంది.
ఇప్పుడు నారా భువనేశ్వరిపై వారు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
నోటికొచ్చినట్లు మాట్లాడేయడం.. ఎవరైనా గట్టిగా రిటార్డ్ ఇస్తే.. ఒక మహిళనని కూడా చూడకుండా ఇలా మాట్లాడతారా అంటూ మైకుల ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టే రోజా, నోరు ఉన్నది బూతులు మాట్లాడడానికే అన్నట్లుగా వ్యవహరించే కొడాలి నానిలు రంగంలోకి దిగారు. భువనేశ్వరి యాత్రను ఫ్యాషన్ షోగా రోజా అభివర్ణిస్తే.. తాను మాత్రమే మాట్లాడగలిగిన ప్రత్యేక బాషలో కొడాలి నాని నోటికి పని చేప్పారు. వెల్లంపల్లి కూడా అవాకులూ చవాకులూ పేలారు.
నారా భువనేశ్వరిది ఫ్యాషన్ షో అన్న రోజా వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విమర్శలకు ఒక హద్దూ పద్దూ, పద్ధతీ పాడూ ఉండదా అని నెటిజన్లు రోజాను చెరిగి పారేస్తున్నారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో చుడీదార్ వేసుకున్న భూమా అఖిల ప్రియపై కూడా రోజా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా జబర్దస్త వంటి కార్యక్రమంలో వెకిలి జోకులకు ఆమె నవ్విన నవ్వులు, చేసిన డ్యాన్సులూ మాత్రం ఇటువంటి విమర్శలు చేసే సమయంలో రోజాకు గుర్తుకు రావా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ విషయానికి వస్తే నారా భువనేశ్వరి తన భర్త అక్రమ అరెస్టును నిరసిస్తూ తొలి సారిగా ప్రజా బాహుల్యంలోకి వచ్చారు. తన భర్త అక్రమ అరెస్టును తట్టుకోలేక తీవ్ర ఆవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగానే వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. సభలలో ప్రసంగాలు చేస్తున్నారు. అన్నిటికీ మించి గత నెలన్నరగా ఆమె రాజమహేంద్రవరంలోనే మకాం వేసి తరచుగా చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. అటువంటి భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత మాటల దాడి కచ్చితంగా బూమరాంగ్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఎంతగా గింజుకున్నా, బరితెగించి అనుచిత వ్యాఖ్యలతో బజారున పడినా.. జనం మాత్రం భువనేశ్వరి యాత్రకు స్వాగతం పలుకుతున్నారనీ, పలుకుతారనీ, ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారనీ,తెలుపుతారనీ తెలుగుదేశం శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో జగన్ పనైపోయిందనీ, ఈ విషయం అందరికంటే వైసీపీయే బాగా తెలుసుననీ, అందుకే వారిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరి..ఇలా నోటికి పని చుబుతూ ప్రజలలో మరింత పలుచన అవుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.