రాయలసీమ నుండి పవన్ కళ్యాణ్ పోటీ.. నియోజకవర్గం ఏదో తెలుసా? | pawan kalyan to contest from rayalaseem| constituency| ananthapuram
posted on Oct 26, 2023 12:29AM
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు? అటు జనసైనికులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఇదే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రత్యర్ధులు ప్రతిసారి ఇదే విషయంపై ఎద్దేవా చేస్తుంటారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ మరోసారి భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ ఉత్తర లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అటు కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుండి కూడా పోటీ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. రాయలసీమలోని తిరుపతి, అనంతపురంలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుండి బరిలో దిగనున్న నేపథ్యంలో తిరుపతి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకే అంటే అనంతపురం నుండి పోటీ చేసేందుకు తెలుగుదేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కోసం అనంతపురం పేరు వినిపించడం వెనక బలమైన కారణం లేకపోలేదు. ఇక్కడ ఉన్న సామజిక వర్గాల బలాబలాల నేపథ్యంలోనే పవన్ ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమవడంతో పాటు రాయలసీమలో బలం పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.
అనంతపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కమ్మ, బలిజ సామాజిక వర్గ ప్రజలు అధికంగా ఉంటారు. దాదాపుగా ఇక్కడ 70 వేల ఓటర్ల వరకూ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారని అంచనా. ప్రస్తుతం వీరంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. అయితే, గతంలో ప్రజారాజ్యం వైపు ఈ సామాజివర్గాల ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు వెళ్లారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత మళ్ళీ వీరంతా తెలుగుదేశం వైపు పోలరైజ్ అయ్యారు. గత ఎన్నికల్లో కొంతమేర జనసేనకు సైతం మద్దతు తెలిపారు. అయితే, ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. పవన్ ఇక్కడ నిలబడితే రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే, నిజానికి ఇంతవరకు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం ఏంటన్నదానిపై స్పష్టత లేదు. పవన్ నుండి కానీ, జనసేన వర్గాల నుండి కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. కానీ ఇప్పుడు పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయనున్నారనే కథనాలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది. చంద్రబాబు రాయలసీమ నుండి కుప్పంలో పోటీ చేయనుండగా.. లోకేష్ కోస్తాంధ్ర నుండి మంగళగిరిలో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే బావుంటుందన్న భావన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ప్రకటన చేయాలని జనసైనికులు కోరుతున్నారు. అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గాల మాదిరిగా.. పవన్ సైతం శాశ్వతమైన ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. మరి పవన్ ఈసారి ఎక్కడ నుండి పోటీకి దిగనున్నారో చూడాల్సి ఉంది.