Leading News Portal in Telugu

తెలంగాణ టీడీపీ అభ్యర్థులు ఫైనల్? | ttdp candidates list final| babu| kasani| mulakhat| 89


posted on Oct 26, 2023 12:23AM

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే తెలంగాణలో టీడీపీ తప్పించి.. మిగిలిన పార్టీలన్నీ అంటే.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ వగైరా వగైర పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను విడతల వారీగా ప్రకటిస్తు వస్తున్నాయి. 

మరోవైపు ప్రచారంలో ఆయా పార్టీలు తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాయి. కానీ టీడీపీ మాత్రం.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అనే ఓ సందేహం అయితే ఆ పార్టీ శ్రేణులు కొట్టుమిట్టాడుతోన్నాయి. అదీకాక ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని.. దీంతో ఆ పార్టీ శ్రేణులన్నీ నోటాకే ఓటు వేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చినట్లు ఓ ప్రచారం అయితే సోషల్ మీడియాలో హోరెత్తి పోతుంది. ఈ ప్రచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ఖండించడమే కాకుండా దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వేళ తెలుగు తమ్ముళ్లకు తీపి కబురు అందనున్నట్లు తెలుస్తోంది. 

అదేమంటే.. రానున్న తెలంగాణ ఎన్నికల్లో 89 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యిందన్న కబురు.  ఆ క్రమంలో ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేసి.. అందులో 189 మంది అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను తయారు చేసి..  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి ఇప్పటికే తెలుగుదేశం తెలంగాణ అద్యక్షుడు  తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం చంద్రబాబు తీసుకోవలసి ఉంది.  

రాజమండ్రి సెంట్రల్ జైల్లో  చంద్రబాబు నాయుడుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ఆ ములాఖత్ లో తెలంగాణలో తెలుగుదేశం పోటీపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  కాగా శుక్రవారం (అక్టోబర్ 27) ఈ ములాఖత్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక రాష్ట్రంలో మిగిలిన 30 నియోజకవర్గాలను పక్కన పెట్టినట్లు ఓ ప్రచారం అయితే కొన.. సాగుతోంది. సదరు ఈ నియోజకవర్గాలు.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని స్థానాలతోపాటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్నా మొత్తం 89 స్థానాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరు.. అలాగే ముగ్గురు వరకు ఆశావాహులుగా ఉన్నారని.. ఆ క్రమంలో వారి సంఖ్య 189 మందికి చేరినట్లు సమాచారం.   చంద్రబాబుతో కాసాని జ్జానేశ్వర్ ములాఖత్ తర్వాత… అభ్యర్థులు జాబితాకు తుది రూపు ఇచ్చి.. రెండు మూడు రోజులలో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇంకోవైపు తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని అందుకోవాలని  బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. ఎలాగైనా కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్, బీజేపీలు   తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అలాంటి వేళ తెలుగుదేశం పార్టీ సైతం రంగంలోకి దిగితే.. ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుందన్నదనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. 

ఇక తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్.. నవంబర్ 3వ తేదీన విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. దీంతో డిసెంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. దాంతో తెలంగాణలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టేది ఆ రోజే తెలిపోనున్నది. ఏది ఏమైనా పోటీలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మాత్రం అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నారు.