తెలంగాణలో టీడీపీ పోటీ.. సస్పెన్స్ కు ఇకనైనా తెరపడేనా? | tdp contest in telangana| end to suspebse| kasani| babu| janasena
posted on Oct 27, 2023 12:31PM
తెలంగాణలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే కేవలం ఇంకో 34 రోజుల సమయం మాత్రమే ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా.. ఏ క్షణమైనా ఈ రెండు పార్టీలు రెండో జాబితా విడుదల చేయాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా చేయదా అనే అంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత అక్రమ అరెస్టుతో జైల్లో ఉండడంతో ఈసారి తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుందనే ప్రచారం జరుగుతూ వచ్చిది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కూడా పోటీ చేస్తుందని ఆయన విస్పష్టంగా చెబుతున్నారు. అటు జనసేన కూడా పోటీలో ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాసాని జ్ణానేశ్వర్ ఏపీలో తెలుగుదేశం పొత్తు ఎలా ఖరారైందో.. తెలంగాణలో కూడా అలాగే ఉంటుందనీ, ఇరు పార్టీలూ కలిసి
మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తాయని చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని చెబుతోంది. బీజేపీ జనసేనలు కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తాయనీ, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయనీ చెబుతోంది. తొలి దశలో బీజేపీ జనసేన మద్దతు ఇవ్వాలనీ, పోటీకి దూరంగా ఉండాలని చేసిన ప్రతిపాదనను జనసేనాని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చరు. ఆ నేపథ్యంలోనే అమిత్ షా ఆహ్వానం మేరకు జనసేనాని ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయి వచ్చారు. ఇది జరిగి మూడు రోజులు కావస్తున్నా అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఆ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అసలు అమిత్ షాతో భేటీ తరువాత ఇరు పార్టీలూ కూడా మీడియా ముందుకు వచ్చిందే లేదు. ఈ నేపథ్యంలోనే కాసాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో లాగే తెలంగాణలో కూడా రెండు పార్టీలో కలిసే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాసాని నేడో రేపో రాజమహేంద్రవరం వెళి చంద్రబాబుతో ములాఖత్ ద్వారా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆ భేటీ తరువాత పోటీపై స్పష్టత ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాసాని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు నేటికీ చెక్కుచెదరకుండా ఉందనీ, ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత తటస్థులు కూడా చంద్రబాబుకు సంగీభావం ప్రకటించడం, స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగడం చూస్తుంటే..చంద్రబాబుపై ప్రజాభిమానం ఇనుమడించిందన్నది అవగతమౌతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తే.. నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.