చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న వెకేషన్ కోర్టు న్యాయమూర్తి | babu interim bail petition| ap| hicourt| vecation| bench| not| before
posted on Oct 27, 2023 2:18PM
చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆయనను జైలులోనే ఉంచి ప్రజలకు దూరం చేయాలన్న వ్యూహంతోనే చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిందన్న విమర్శలలో, ఆరోపణల్లో వాస్తవం ఉందన్న నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది. ఆయనకు జైల్లో భద్రత కరవైందనీ, ఆయన ఆరోగ్యంపై కూడా జైలు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనీ మొదటి నుంచీ చంద్రబాబు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులూ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయినా వాటిపై ఇటు జగన్ సర్కార్ కానీ అటు జైలు అధికారులు కానీ స్పందించడం లేదు.
కోర్టులలో ఆయన పిటిషన్లు సాంకేతిక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఆయన పిటిషన్లు వాదించేందుకు న్యాయమూర్తులు కూడా వెనుకాడుతున్న సంఘటనలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో తెటతెల్లం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా చంద్రబాబు మధ్యంతర బెయిలు పిటిషన్ విచారణ శుక్రవారం హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రావాల్సి ఉండగా చివరి క్షణంలో విచారణ జరపకుండానే న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలగారు. ఈ పిటిషన్ విచారణ ఏ బెంచ్ చేపట్టాలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. ఇక తన ఉత్తర్వుల కారణంగా చంద్రబాబు ఆరో్య కాకరణాల రిత్యా తీసుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవరోధం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.
స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టై గత 49 రోజులుగా రాజమహేంద్రవరం జైలులో ఉన్నచంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆయన హెల్త్ బులిటిన్ ను వైద్యులు కాకుండా జైలు అధికారులు విడుదల చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికను వైద్యులు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి కూడా అందించారు. జైలు అధికారులు భువనేశ్వరికీ, జైలు అధికారులకూ ఒకే నివేదిక ఇచ్చినా జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటిన్ లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కీలక, ముఖ్యమైన అంశాలు లేవు. దీంతో కుట్ర పూరితంగా చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా సరైన చికిత్స కూడా అందకుండా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే ఈ నెల 25న చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖలో తన భద్రతకు, ఆరోగ్యానికి జైలులో రక్షణ లేదని విస్ఫష్టంగా పేర్కొన్నారు. ఓ ఖైదీకి పెన్ కెమెరా ఇచ్చి ఉద్దేశపూర్వకంగా తన బ్యారక్ దృశ్యాలను చిత్రీకరింపచేస్తున్నారని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. జైలు లోపలి దృశ్యాలు అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో కనిపిస్తున్నాయనీ, తనను హత్య చేస్తామని బెదిరిస్తూ జైలు అధికారులకు వచ్చిన లేఖపై పోలీసులు విచారణ జరపలేదనీ పేర్కొన్నారు. జైలుపై పలుమార్లు డ్రోన్లు ఎగిరినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై భౌతిక దాడులు చేస్తోందని గతంలో జరిగిన పలు ఘటలను ఉదహరించారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు ఈ లేఖ రాసి రెండు రోజులు అవుతోంది. తాను జడ్ ప్లస్ ప్రొటెక్టీనని… కానీ తన భద్రత విషయంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆ లేఖపై ఇంత వరకూ ఎటువంటి చర్యలూ లేవు.