Leading News Portal in Telugu

అవహేళన చేస్తారా .. అనుభవిస్తారు.. వైసీపే తీరుతో అగ్రహిస్తున్న జనం | bhuwaneswaru nijam gelavali yatra| ycp| mockery| people| angry


posted on Oct 28, 2023 6:25AM

ఆమె రాజకీయ నాయకురాలు కాదు. అలాగని ఆమెకు రాజకీయాలు తెలియవని కాదు. ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు, మరో ముఖ్యమంత్రి భార్య, అయినా  ఆమె  రాజకీయాలకు దూరంగా ఒక సాధారణ గృహిణి. స్వశక్తిని నమ్ముకున్న ఒక చక్కని వ్యాపారవేత్త. అంతకు మించి సేవా మార్గంలో ముందుకు సాగుతున్న ఒక ఆదర్శమహిళ. అవును ఆమె ఎవరో కాదు… విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల ‘అన్న’ అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ నందమూరి తారక రామా రావు కుమార్తె. అలాగే, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించిన, విశేష అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి  నారా భువనేశ్వరి. 

నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా  ఉన్న రోజుల్లో సైతం ఆమె ఏనాడూ ఆయనతో రాజకీయ వేదికలను పంచు కోలేదు. ముఖ్యమంత్రి సతీమణిగా పాటించవలసిన ప్రోటోకాల్ అవసరాలకు మించి మరో అడుగు ముందుకు  వేయలేదు. ప్రభుత్వం తరపున నిర్వహించే  దైవ కార్యాల్లో భర్త వెంట భార్యగా పాల్గొనడమే తప్ప ఎప్పుడూ,ఎక్కడా గీత దాట లేదు. ఇన్నేళ్లుగా చంద్రబాబు  నాయుడు సతీమణిగా ఆమె ఎన్నో ఎన్నికలు చూశారు. అయినా, ఏ నాడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొందరిలా  భర్త చెప్పుల్లో కాలు పెట్టలేదు. 

మనకు తెలుసు, వైఎస్ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ విజయమ్మ  ఎన్నెన్ని రాజకీయ విన్యాసాలు చేశారో, చేస్తున్నారో మనం అందరం చూశాం, చూస్తున్నాం. భర్త కోసం, కొడుకు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం పులివెందుల ప్రజలకు తెలియంది కాదు. అలాగే, ఆమె భర్త వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత ఆమె స్వయంగా ఎన్నికల బరిలో దిగారు.. మరోవంక అటు ఏపీలో కొడుకు, జగన్ రెడ్డి ఇటు తెలంగాణలో కుమార్తె షర్మిల రాజకీయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. తప్పు కాకపోవచ్చును. కానీ, ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని    వైసీపీ నాయకులు గురువింద గింజల్లా, నవ్వి పోదురు గాక  నాకేటి సిగ్గని భువనేశ్వరిని, నిజం గెలవాలి యాత్రను విమర్శిస్తున్నారు.  

అదలా ఉంచితే, భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఇటు తండ్రి నుంచి, అటు భర్త నుంచి అబ్బిన  ప్రజాసేవ కు   ఏ నాడు దూరం కాలేదు. తమకున్నది నలుగురితో పంచుకోవాలనే ఎన్టీఆర్ ఆదర్శానికి అద్దం పడుతూ, 26ఏళ్ల క్రితం అంటే తన తండ్రి మరణించిన తర్వాత తండ్రి పేరుతో  ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో ఎన్నెనో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ను స్థాపించి అందులో వేలమంది అనాధ పిల్లలను ఉచితంగా చదిస్తున్నారు… ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్స్ అందిస్తూ 4,193 మంది పేద విద్యార్థులకు 3.44కోట్ల ఆర్థిక సాయం అందించారు… బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రతి ఏటా 50మంది ప్రతిభ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఇప్పటివరకు 1.93కోట్లు స్కాలర్ షిప్ రూపంలో అందించారు…ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,617మంది విద్యార్థులను కాలేజీలలో చదివిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థాపించి 7,345 యువతీ యువకులకు శిక్షణ ఇప్పించి వారిలో 2,500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు.  జాబ్ మేళాలు నిర్వహించి మరో 4,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు…గత 26 సంవత్సరాలలో 11,372 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 19,07,443 మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు…రక్త నిధి కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 83,582 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందులో 20,045 యూనిట్ల రక్తాన్ని తలసేమియా వ్యాధి బాధితులకు 55,048 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర సేవల నిమిత్తం అందించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లను, 42ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పి తాగు నీరు అందిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయాల్లో ఇప్పటివరకు 20లక్షల మందికి సాయం అందించారు. 2013లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు 500మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చేర్చారు. 2014లో హుద్ హుద్ తుపాను  వచ్చినప్పుడు 50,000మంది బాధితులకు మందులు, ఆహారం, మజ్జిగ, పాలు, త్రాగునీరు అందించారు. 2016లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు 10బస్తీలలోని 5,000మంది పేదలకు సాయం అందించారు.  2009లో కర్నూల్, మహబూబ్ నగర్ లో వరదలు సంభవించినప్పుడు 54వైద్య బృందాల ద్వారా శిబిరాలు నిర్వహించి 15కోట్ల విలువైన మందులు, వస్త్రాలు, దుప్పట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు.  2021లో చిత్తూరు నెల్లూరులలో భారీ వరదలు వచ్చి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు 50వేల మందికి పైగా వరద బాధితులకు ఆహారం, పాలు, త్రాగు నీరు, దుప్పట్లు, నిత్యావసర సరకులు అందించారు. అంతేకాకుండా వరదల్లో మరణించిన 48మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 48లక్షలు సాయం చేశారు. కరోనా సమయంలో 1,500 మంది కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించారు. 2లక్షల మాస్కులు అందించారు. 29లక్షల విలువైన మందులు పంపిణీ చేశారు. 1.35కోట్లతో ఏపీ, తెలంగాణలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా అధిక బరువు, కొలెస్టరాల్, డయాబెటీస్, రక్తపోటు నియంత్రణ కోసం న్యూట్రిపుల్ యాప్ ద్వారా న్యూట్రిషనిస్టుల ద్వారా డైట్ ప్లాన్లను, ఆరోగ్య సలహాలను ఉచితంగా అందిస్తున్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంజీవని  పేరుతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

నిజానికి, ఇన్ని లక్షల మందికి ఎన్నో కోట్ల రూపాయల సాయం అందిస్తూ కూడా ఆమె   తెలుగు దేశం పార్టీకో, చంద్రబాబు నాయుడు, లేదా లోకేష్ కు ఓటు వేయమని ఎవరినీ ఏనాడూ  అడగలేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాంటి మాతృమూర్తి, ఈరోజు అనివార్యంగా జనంలోకి వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తన భర్తను అక్రమంగా నిర్బంధించి, 50 రోజులుగా అనేక విధాల వేధింపులకు గురి చేస్తున్న నేపధ్యంలో, భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో జనంలోకి వచ్చారు. అది కూడా ఓట్ల కోసమో, రాజకీయం కోసమో, కాదు. చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శింఛి, ఒక్కొక కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి.  అయితే దురదృష్టం ఏమంటే, గతాన్ని మరిచిన కొందరు ప్రబుద్ధులు మానవత్వాన్ని మరిచి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రను  రాజకీయ కోణంలో చూస్తున్నారు.  అనుచిత విమర్శలు చేస్తున్నారు.

అయితే, భువనేశ్వరి పదే పదే చెపుతున్నట్లుగా ఈరోజు కాక పోయినా రేపైనా నిజం గెలుస్తుంది. సత్యమేవ జయతే .. సందేహం లేదు. అయితే, చంద్రబాబును అక్రమంగా జైల్లో బందించి వైసేపీ నేతలు పొందుతున్న రాక్షస ఆనందం. చేస్తున్న వికటాట్టహాసం తెలుగు దేశం నాయకులు , కార్యకర్తలనే కాదు. సామాన్య  ప్రజల చేత కూడా కంటతడి పెట్టిస్తోంది. కన్నెర్ర చేయిస్తోంది. అయితే  ఈరోజు విర్ర వీగుతున్న వైసీపీ  నేతలు అంతకు అంత చెల్లించక తప్పని రోజు ఇక ఎంతో దూరంలో లేదని వైసీపే నాయకులు గ్రహిస్తే మంచింది.. లేదంటే, నిజం గెలవాలి .. రాజకీయ బ్రహ్మస్త్రంగా మారుతుంది . ఇది తథ్యం అంటున్నారు పరిశీలకులు.