posted on Oct 28, 2023 1:14PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. కాంగి‘రేసు’కు అసమ్మతి కళ్లేం వేస్తున్నదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్, అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ డీలాపడిన వేళ.. అనూహ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యతారాగం ఆలపిస్తూ కాంగ్రెస్ దూసుకుపోతున్నది. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత మాత్రం కాంగ్రెస్ లో అసమ్మతి, గ్రూపు విభేదాలు దాదాపుగా సమసిపోయాయన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.
ఎవరికి వారు.. తమలో విభేదాలు ఉంటే తరువాత చూసుకుందాం.. ముందు అధికారం కోసం సమైక్యంగా కదులుదాం అన్నట్లుగా పార్టీ రాష్ట్ర నాయకులంతా ముందుకు సాగుతున్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైందో.. ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. ఎన్నికల విజయంపై ధీమాతో రేసుగుర్రంలా ముందుకు దూసుకెడుతున్న కాంగ్రెస్ కు కళ్లెం పడింది. ఒక్క సారిగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు నిరసన గళం విప్పారు. రాజీనామాల బాట పట్టేలా కనిపిస్తున్నారు. టికెట్ రాక భంగపడిన నాయకులు తమ అనుచరులతో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ముందుగా టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన దివంగత నేత పీజేఆర్ తనయుడు కావడం విశేషం. విష్ణువర్ధన్ రెడ్డి ఆశించిన జూబ్లీహిల్స్ స్థానాన్ని మాజీ క్రికెటర్ అజాహరుద్దీన్ కు కేటాయించింది. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి పార్టీ టికెట్ ఆశించిన దండెం రాంరెడ్డి సైతం తన అసమ్మతిని బాహాటంగానే వెల్లడించారు.
అలాగే మహేశ్వరం, హుస్నాబాద్ జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ స్థానం నుంచి అజరుద్దీన్ కు సీటు కేటాయించింది. దీంతో విష్ణువర్ధన్ నేడు తన అనుచరులతో భేటీ కానున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్, మునుగోడు, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో కూడా అసమ్మతి భగ్గుమంది. ఆయా నియోజకవర్గాలలో టికెట్ ఆశించిన నేతలు కూడా కాంగ్రెస్ ను వీడే యేచనలో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆత్మీయులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద నిన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అసమ్మతి మంటలు రేగుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి.
వీరితో పాటు రెండో జాబితాలో కూడా టికెట్ దక్కని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా అలకబూనినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆశించిన స్థానం నుంచి కేసీఆర్ పోటీకి దిగుతుండటంతో ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ ను రంగంలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఆయనను నిమాజాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే అక్కడ నుంచి పోటీకి షబ్బీర్ అలీ పెద్దగా సుముఖత చూపడం లేదని అంటున్నారు. అలాగే పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అంటున్నారు.