బాలినేనికి మళ్లీ పిలుపు.. ఏం జరుగుతోంది?.. ఏం జరుగుతుంది? | tadepalli call to balineni again| what| happening| ycp| quit| yv| subbareddy| compromise
posted on Oct 28, 2023 12:12PM
ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. శనివారం(అక్టోబర్ 28) ఉదయం వైవీ సుబ్బారెడ్డితో కలిసి వచ్చి తనను కలవవలసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన్నట్లు చెబుతున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య విభేదాల పరిష్కారానికే ఈ పిలుపు అని పార్టీ వర్గాలు చెబుతున్నా.. అంతకు మించిన కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. బాలినేనికి మంత్రివర్గ విస్తరణ సమయంలో కేబినెట్ నుంచి తొలగించిన నాటి నుంచీ ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు. పార్టీలోనే కాకుండా, నియోజకవర్గంలో కూడా తన మాట చెల్లుబాటు కావడం లేదన్న అసంతృప్తిని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా వ్యక్తం చేసిన ప్రతి సారీ తాడేపల్లి నుంచి పిలుపురావడం.. ఆయన ఇష్టంగానో, అయిష్టంగానో సర్దుకు పోవడం జరుగుతూనే ఉంది.
ఇంతకీ బాలినేని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీకి నష్టం కలిగే వ్యాఖ్యలు చేసినా ఇంత వరకూ ఆయనపై వేటుపడకపోవడానికి కారణం.. ఆయన సీఎం జగన్ కు బంధువు కావడమేనని అంటున్నారు. అయితే జగన్ లో బాలినేని తన బంధువు అన్న సానుకూలత ఇసుమంతైనా లేకపోయినా.. ఆయన పార్టీ వీడి వెళ్లకుండా నిలువరించడం, అలాగే ఎంత అలకబూనినా బాలినేని తెగే వరకూ లాగకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తల్లినీ, చెల్లినీ పార్టీ నుంచి బయటకు గెంటేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు బాలినేనిని కూడా బయటకు పంపితే.. అది పార్టీ శ్రేణులకే కాకుండా.. ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలిస్తుందన్న భావనతోనే బాలినేనిని తాను స్వయంగా పొమ్మనడం లేదని చెబుతున్నారు. అలాగే బాలినేని కూడా ఎన్ని అవమానాలెదురైనా పార్టీనే పట్టకు వేలాడటానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆయనతోనే ఉన్న బాలినేని.. ఇప్పుడు బయటకు వెళ్లాలని భావించినా.. ఆయనకు స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పార్టీ ఏదీ లేకపోవడంతో కేవలం తన రాజకీయ భవిష్యత్ ఏమౌతుందో అన్న ఆందోళనతోనే వైసీపీలో పొమ్మన లేక పొగబెడుతున్నా.. ఆ పొగకు ఉక్కిరిబిక్కిరై విలవిలలాడుతున్నారు కానీ.. స్వతంత్రించి, ధైర్యం చేసి బయటకు రావడం లేదని అంటున్నారు.
ఇక బాలినేనికి వైసీపీతో బంధం తెగిపోయినట్లే అన్న పరిస్థితి వచ్చిన ప్రతిసారీ.. తాడేపల్లి నుంచి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులో.. బెదరింపులో తెలియదు కానీ బయటకు వచ్చి బాలినేని సర్దుకు పోవడం ఈ రెండేళ్లుగా రివాజుగా మారింది. ఇక బాలినేనికి పొసగని సుబ్బారెడ్డి కూడా జగన్ కు సమీప బంధువే. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం బాలినేనికి జగన్ ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నారు. జగన్ బాలినేని పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే పార్టీలో, అధికారులలో కూడా ఆయనకు మన్నన మర్యాదా లేవన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల తన అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో మీడియా ముఖంగా వైసీపీ పెద్దలపై విరుచుకుపడిన బాలినేని.. తన వాళ్లపై సప్సెన్సన్ ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. గడువు సైతం విధించారు. కానీ ఆయన కోరుకున్నట్లుగా తన వారిపై సస్పెన్షన్ ఎత్తివేయకున్నా సర్దుకునిపోయారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని, పోలీసుల నుండి రెవెన్యూ అధికారుల వరకు ఎవరికీ తన మాట అంటే లెక్కలేకుండా పోయిందని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఆ తరువాతా షరామామూలే.
ఇవన్నీ పక్కన పెడితే.. ప్రకాశం జిల్లాలో ఓ భూ ఆక్రమణల కుంభకోణం విషయంలో ఫైర్ అయి తన సెక్యూరిటీని సరెండర్ చేసిన బాలినేని.. ఆ చర్యతో అందరి దృష్టీ ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై పడేలా చేశారు. ఈ భూ కుంభకోణం వెనుక ఉన్నది వైసీపీ వారే కావడంతో జగన్ కు బాలినేని చర్య ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇక బాలినేని పనైపోయిందనే అంతా అనుకున్నారు. అయితే ఇటీవల జగన్ తల్లి వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒంగోలులో బాలినేనికి కలిశారు. ఆ సందర్భంగా బాలినేని తన గోడు వెళ్లబోసుకుంటే..తానేం చేయలేనని విజయమ్మ నిస్సహాయత వ్యక్తం చేశారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేనికి తాడేపల్లి నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పిలుపు రాజీ కోసం కాదనీ, బుజ్జగించేందుకు అసలు కాదనీ పరిశీలకులు అంటున్నారు. బాలినేని, సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇద్దరినీ ఒకే సమయంలో కలవాలని జగన్ భావించడం వెనుక బాలినేని సుబ్బారెడ్డితో సమన్వయం లేకుంటే కుదరదు అన్న అల్టిమేటమ్ ఇవ్వడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డితో చాలా ఇబ్బందులు ఎదుర్కొం టున్నానని బాలినేని ఇదివరకే జగన్‌కు ఫిర్యాదు చేసినందున ఈ భేటీలో కూడా జగన్మోహన్ రెడ్డి వైవీకే ప్రాధాన్యత ఇస్తే.. బాలినేని పార్టీ వీడడం ఖాయమని అంటున్నారు.