Leading News Portal in Telugu

టెన్షన్ ఎందుకు దండగ.. జగన్ ఉండగా అంటున్న బీఆర్ఎస్! | brs win hopes on jagan failures| amarawathi| harish| comments| vindictive| politics| hyderabad


posted on Oct 28, 2023 4:13PM

సొంత రాష్ట్రంలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా బీఆర్ఎస్ లో గెలుపు ధీమా తగ్గడం లేదు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ఎత్తి చూపుతున్నా ఖాతరు చేయడం లేదు. ఎందుకంటే వారి ధీమా వెనుక ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్ సర్కార్ వైఫల్యాలు ఉన్నాయి. సాటి తెలుగు రాష్ట్రంలో అభివృద్ధి లేమినీ, గడిచిన నాలుగున్నరేళ్లలో రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేని ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతూ.. ఇంత కంటే రుజువేం కావాలి మేం బ్రహ్మాండంగా పని చేశామని చెప్పుకోవడానికి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు. పదే పదే ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ వైఫల్యాలనూ, నిష్క్రియాపరత్వాన్నీ ఎత్తి చూపుతూ తెలంగాణ ప్రజల మనస్సులను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఐటీ కంపెనీలు రాష్ట్రంలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయి. పరిశ్రమలు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా  పోరుగు రాష్ట్రంలో బిచాణా ఎత్తేసి మరీ తెలంగాణకు తరలివస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. అమరరాజా బ్యాటరీస్ ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. వీటన్నిటినీ చెప్పుకుని తెలంగాణను ఇంతగా అభివృద్ధి చేశామనీ, అదే పొరుగున ఉన్న ఏపీలో అయితే అభివృద్ధి ఆనవాలే కనిపించడం లేదనీ చెప్పుకుంటోంది. 

ఇలా ఆంధ్రప్రదేశ్ ను గేలి చేస్తూ తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలూ ఎన్నిరకాలుగా విమర్శించినా ఏపీలో మంత్రుల నోటి వెంట ఒక్క ఖండన కూడా రావడం లేదు. ఏపీ మంత్రులకు రాష్ట్ర అభివృద్ధీ పట్టదు? ప్రజల సంక్షేమమూ పట్టదు. ఎంత సేపూ బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటూ ఆత్మస్థితికీ, విపక్షాల నాయకులపై విమర్శల దాడికే ఎక్కడి సమయమూ సరిపోవడం లేదు. 

తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు జగన్ గాలి తీసేసే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన వైనాన్ని ఎత్తి చూపుతూ.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిన వైనాన్ని ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి మరింత జోరందుకుంటుందనీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ను చూస్తున్నారుగా? అంటూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను చూపి ప్రజలను హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి రాకుంటే.. హైదరాబాద్ పరిస్థితి అమరావతిలా మారిపోతుందంటూ ప్రజలకు హెచ్చరికలాంటిది చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యాలే తమకు విజయసోపానాలుగా ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ సర్కార్ ను వైఫల్యాలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలూ ఇంతగా విమర్శించి, గేలిచేస్తున్నా ఏపీ అధికార పార్టీ నేతలకు చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదంటే ఆ విమర్శలను వారు వాస్తవమేనని అంగీకరిస్తున్నారనే అర్ధమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రాలుగా విడిపోయినా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు పరస్పరాధీనాలు అన్నది నిర్వివాదాంశం. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపైనా, తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను చూసిన తెలంగాణ జనం.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ ను చూసి గర్వపడతారనడంలో సందేహం లేదు. దానినే తమ ఎన్నికల విజయానికి దోహదపడేలా మార్చుకోవాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. పైగా ఎం అన్నా నోరెత్తలేని పరిస్థితుల్లో జగన్ సర్కార్, ఆయన కేబినెట్ సహచరులు ఉండటం కూడా తెలంగాణలోని అధికార పార్టీకి సానుకూలాశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో జగన్ కు సంపూర్ణ సహకారం అందించిన కేసీఆర్ ఇప్పుడు జగన్ సర్కార్ వైఫల్యాలను అవహేళన చేస్తూ.. తమ విజయానికి బాట వేసుకోవాలని భావిస్తున్నారు.  ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హైద్రాబాద్ కు ఏపీలో అమరావతికి పట్టిన గతే పడుతుందని తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో జగన్ హయాంలో ఏం జరిగింది? గత ప్రభుత్వం బ్రహ్మాండంగా వేసిన అభివృద్ధి పునాదులు కూలిపోయాయి. ప్రపంచ రాజధానిగా దేశ విదేశాల ప్రశంసలు అందుకున్న అమరావతి నేడు నిర్వీర్యమైపోయింది. ఈ విషయాన్నే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పి విజయానికి బాటలు వేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. వాస్తవానికి మామూలు పరిస్థితుల్లో అయితే హరీష్ రావు వ్యాఖ్యలు, విమర్శలు తెలంగాణ సమాజంపై పెద్దగా ప్రభావం చూపి ఉండేవి కావు. కానీ ఏపీ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడి అరెస్టు తరువాత ఏపీలో జరుగుతున్న ప్రతి విషయమూ తెలంగాణ ఎన్నికలను  ప్రభావితం చేసేదిగానే మారింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో కూడా ఏపీతో సమానంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక పార్టీ, ఒక నాయకుడు అని కాకుండా సామాన్య జనులు, ఐటీ ఉద్యోగులూ, పార్టీలతో సంబంధం లేకుండా నేతలూ అంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించకపోయినా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేసుకోవాలంటే ఏపీ వెళ్లి చేసుకోండి.. ఇక్కడ మాత్రం అంగీకరించం, అనమతి ఇవ్వం అని మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించినా బాబుకు మద్దతు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే వస్తున్నది.

కాగా మంత్రి హరీష్ రావు మాత్రం బాబు అరెస్టును తొలి నుంచీ ఖండిస్తూనే వచ్చారు. ఏడు పదులు నిండిన వయస్సున్న వ్యక్తిని అక్రమంగా జైలులో నిర్బంధించడం సరికాదని అన్నారు. ఎన్నికల వేళ తనవ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ కూడా మాట మార్చి చంద్రబాబు అరెస్టును ఖండించారు. లోకేష్ కు పూర్తి సంఘీభావం ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తొలుత ఎవరూ కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు.. కానీ అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సెంటర్ పాయింట్ గా మారిపోయింది. అందుకే తెలంగాణలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారూ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ స్పందించకున్నా… కేటీఆర్ ఆందోళనలు వద్దన్నా.. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులూ ఖాతరు చేయలేదు. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం స్పందించకున్నా తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం బాబు అరెస్టును ఖండించడంలో ముందున్నారు.

ఈ నేపథ్యంలోనే హరీష్ రావు జగన్ సర్కార్ పై విమర్శల దాడిని పెంచడాన్ని అర్ధం చేసుకోవాలి. ఏపీలో జగన్ సర్కార్ ను ఎంతగా విమర్శిస్తే తెలంగాణలోని చంద్రబాబు అభిమానులను అంత ఎక్కువగా ఆకట్టు కోవచ్చని ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే హరీష్ రావు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందనీ, అదే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పుకున్నారు.