రాజకీయ ప్రచారానికి ప్రభుత్వోద్యోగుల వినియోగం.. బీజేపీకి రోల్ మోడల్ జగనేనా? | using government employees for political needs| modi| following| jagan| party
posted on Oct 30, 2023 3:11PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక విలక్షన రాజకీయనాయకుడు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా ఉందన్న సంగతిని ఆయన విస్మరించడమే కాకుండా.. అధికారులూ, కేబినెట్ సహచరులూ కూడా మరిచిపోయేలా చేయగలిగారు. ప్రభుత్వానికీ, అధికార పార్టీకీ మధ్య ఉన్న గీతను ఆయన చెరిపేశారు. ఆ రెండూ వేరువేరు కదా అంటే.. అలా ఎలా అవుతుంది అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన ప్రసంగాలన్నీ విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే పరిమితమౌతాయి. ఇక అధికారులు సైతం పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా లేదన్నట్లుగానే పార్టీ నేతలు, కార్యకర్తల మాటకే విలువనిచ్చి తరలిస్తుంటారు.
సంక్షమం అటూ జగన్ బటన్ నొక్కేందుకు ఏర్పాటు చేసే బహిరంగ సభలన్నీ కూడా వైసీపీ ప్రచార కార్యక్రమాలుగానే ఉంటాయి. ఆయా సభలలో ఆయన విపక్షాలు, విపక్ష నేతలపై విమర్శలకే సమయం అంతా కేటాయిస్తుంటారు. ఆ సభలన్నీ ప్రభుత్వ వ్యయంతో అంటే ప్రజాధనంతోనే నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వ యంత్రాంగమంతా వైసీపీ కోసమే పని చేస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. పార్టీ నేతలు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు జరిగిన లబ్ధి ఇదీ అని చెప్పుకోవడానికి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో నేతల కంటే అధికారుల హడావుడే ఎక్కువగా కనిపిస్తున్నది. వైసీపీ నాయకులతో పాటు అధికారులూ ఇంటింటికీ తిరిగి ప్రజలకు అందిన సంక్షేమాన్ని చెప్తున్నారు. అధికారులు రాజకీయ నాయకులకు అసిస్టెంట్లుగా, వారి తరఫున మాట్లాడే వారిగా వ్యవహరిస్తున్నారు. సరే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు ఎదురైన పరాభవాన్ని పక్కన పెడితే.. అధికార యంత్రాంగాన్ని ఇష్టారీతిగా వాడేసుకోవడం వైసీపీతోనే ప్రారంభమైందని చెప్పాలి.
ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కోసం ఇష్టారీతిగా వాడేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క జగన్ ప్రభుత్వమేనని చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది చట్ట ప్రకారం కూడా నిషిద్ధం. ఈ విషయంలో జగన్ సర్కార్ పై విపక్షాల విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాల్సిన కేంద్రం కూడా.. ఇదేదో బాగున్నట్లుందే అని అదే దారిలో నడవడానికి రెడీ అయిపోయింది. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలంటే జగన్ మార్గమే రోల్ మోడల్ అని మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. అందుకే జగన్ తరహాలోనే అధికార యంత్రాంగాన్ని వాడేసుకుని ప్రయోజనం పొందేలా కార్యక్రమాన్ని రూపొందించింది.
గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మోడీ సర్కార్ సాధించిన విజయాలను ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీలను వేసి మరీ ప్రచారం చేయడానికి రెడీ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించింది. వచ్చే నెల 20 నుంచి జనవరి 25 వరకూ మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారానికి ఒక కార్యక్రమం రూపొందించింది. ఈ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కూడిన కమిటీలను దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి రక్షణ శాఖ ఉద్యోగులను కూడా వినియోగించుకోవడానికి సైతం మోడీ సర్కార్ వెనుకాడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలు, ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం.
అయితే ఏపీలో ఈ నిషేధిత కార్యక్రమాన్ని జగన్ సర్కార్ కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగిస్తోంది. దీంతో జగన్ సర్కార్ నే ఆదర్శంగా తీసుకున్న చందంగా ఇప్పుడు మోడీ సర్కార్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలకూ, ప్రచారానికి వినియోగించుకోవడానికి రెడీ అయిపోయింది. తాను నిత్యం ప్రవచించే భారత రాజ్యాంగం, విలువలకు తిలోదకాలిచ్చి ఇలా ప్రభుత్వ ఉద్యోగుల చేత తన విజయాలను ప్రచారం చేయించుకోవడాన్ని మోడీ ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సి ఉంది.