Leading News Portal in Telugu

బీజేపీలో మోడీ స్వామ్యం.. రాష్ట్రాలలో నాయకత్వం శూన్యం | no leadership for bjp in states| modi| worship| five| states| elections| party| hard


posted on Oct 30, 2023 4:25PM

ప్రాంతీయ పార్టీలను మించి బీజేపీలో వ్యక్తిపూజ పెరిగిపోతున్నదా? ఏకస్వామ్యం రాజ్యమేలుతోందా? ఇంత కాలం కుటుంబ పార్టీలు అంటూ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలపై   విమర్శలు గుప్పించిన మోడీ.. కాంగ్రెస్ డైనాస్టీని ఎత్తి చూపిన మోడీ.. ఇప్పుడు అంతకు మించీ బీజేపీలో  సర్వం తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.

మోడీ తీరు కారణంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల వేడి జోరందుకుంది. అయితే బీజేపీలో ఆయా రాష్ట్రాలలో బీజేపీలో మాత్రం ఒక విధమైన నిస్తేజం కానవస్తోంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రచారం నుంచి ప్రతి విషయం పార్టీ అధిష్ఠానం కనుసన్నలలోనే నడవాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక నాయకత్వం దాదాపుగా నిర్వీర్యమైపోయింది. పార్టీ రాష్ట్రాల అధ్యక్షులను ఇష్టారీతిగా మార్చేయడం, ఆ మార్పు చేర్పులలో ప్రాంతీయ నాయకుల పాత్ర ఇసుమంతైనా లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీకి నాయకత్వమన్నదే లేకుండా పోయింది.  పార్టీ రాష్ట్ర శాఖలపై హైకమాండ్ పెత్తనం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రాలలో పట్టు ఉన్న నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడం, అందుకోసం రాష్ట్రాల అధ్యక్షులనే కాదు, మాజీ ముఖ్యమంత్రులను సైతం పక్కన పెట్టేయడంతో  బీజేపీ రాష్ట్రాలకు చెందని పార్టీగా మారిపోయింది.

బీజేపీ అంటే జాతీయ స్థాయిలో పలుకుపడి కలిగిన పార్టీకే పరిమితమైపోయింది.   ప్రాంతీయ నాయకులు లేని కొరత ఇప్పుడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆయా రాష్ట్రాలలో  పలుకుబడి ఉన్న నేతలకు పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఎన్నికలలో వారి కొరత తీర్చేందుకు రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన పరిస్థతి ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని బీజేపీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారం అంతా మోడీ చుట్టూ కేంద్రీకృతమై ఉండటంతో స్థానిక నేతలకు పనిలేకుండా పోయింది. ప్రజలలో పలుకుబడీ పలుచనైంది. 

ముందుగా తెలంగాణ విషయానికి వస్తే..  తెలంగాణలో బీజేపీని దౌడు తీయించి, అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగే పరిస్థితికి తీసుకువచ్చిన బీసీ నేత బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి… ఇప్పుడు అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటించింది. అయితే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి అధికారం కోసం పోటీ పడే పరిస్థితి నుంచి రాష్ట్రంలో హంగ్ వస్తే కనీసం చక్రం తిప్పితే చాలనుకునే పరిస్థితిని దిగజారింది. మరీ ముఖ్యంగా బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు పార్టీ అధిష్ఠానం అనుకూలంగా వ్యవహరించిందన్న భావన పార్టీ శ్రేణుల్లోనే కాదు.. సామాన్య జనంలో కూడా వ్యక్తం అయ్యింది.  అయితే పార్టీ శ్రేణులలో ఆ భావనను తొలగించేందుకు బీజేపీ హై కమాండ్ ఏ మాత్రం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తెలంగాణలో అధికార రేసులో బీజేపీ వెనుకబడడానికి బీజేపీ హై కమాండ్ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే.. అక్కడ ప్రజలలో మంచి పలుకుబడి కలిగిన మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ను పక్కన పెట్టడంతో  ఆ రాష్ట్రంలో బీజేపీ బాగా వెనుకబడింది. రమణ్ సింగ్ ను వ్యతిరేకించే బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకత్వాన్ని ప్రోత్సహించిన బీజేపీ హైకమాండ్ వైఖరి కారణంగా.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత మటుమాయమైపోయింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపకుండా పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతోనే బీజేపీ స్వయంగా తన పతనాన్ని తానే శాసించుకున్నట్లైంది. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి. అక్కడ బలమైన నేత వసుంధరారాజెను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. గెహ్లాట్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే బలమైన నేత లేని పరిస్థితిని స్వయంగా బీజేపీ అధిష్ఠానమే తీసుకువచ్చింది.    నిజానికి  రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల విసిగిపోయిన ప్రజానీకం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తు న్నారు. అయితే ఆ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి అవకాశం లేని పరిస్థితులను బీజేపీ హై కమాండే తీసుకువచ్చింది.ఇక మధ్య ప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజాభిమానాన్ని కోల్పోయిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొనసాగిస్తూ.. పార్టీని బలహీనపరిచింది. మిజోరంలో త్రిముఖ పోటీలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడా మిత్రపక్షంతో సయోధ్యలేని పరిస్థితుల్లో ఎదురీదుతోంది. ఈ ఐదు రాష్ట్రాలలోనూ కూడా స్థానిక నాయకత్వాన్ని బీజేపీ హై కమాండ్ నిర్వీర్యం చేసిన కారణంగానే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ విషయంలో బీజేపీ ఏ విమర్శలైతే చేసిందో… ఇప్పుడు అవే విమర్శలను సొంత పార్టీ నుంచే బీజేపీ ఎదుర్కొంటోంది.