Leading News Portal in Telugu

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ బండి సంజయ్.. హెలికాప్టర్ కేటాయింపు.. రోజూ మూడు సభలలో ప్రసంగాలు! | bjp star campaigner bandi| sanjay| daily| three| meetings| helicopter| amit


posted on Oct 31, 2023 7:19AM

కాస్త ఆలస్యంగానైనా బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో బీజేపీ నిస్తేజంగా మారిపోవడానికి కారణాలను గుర్తించింది. తెలంగాణ ఎన్నికలలో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. ఎన్నికల ముంగిట తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ప్రతికూలంగా మారింది. అప్పటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా జోరు మీద ఉన్న పార్టీ.. బండి సంజయ్ ను పార్టీ అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాత తడబడింది. వెనుకబడింది.  

ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన విషయాన్ని గుర్తించిన అమిదత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌‌ను కొనసాగించాలని హైకమాండ్ ఆదేశించింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుగా ఆయన   హెలికాప్టర్ కేటాయించింది.  బండి సంజయ్ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తారని, ఆయనకు సహకరించాలని కేంద్ర హోం  మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీని ఆదేశించినట్లు తెలుస్తోంది.అంతకు ముందు బండి సంజయ్‌తో అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని ఆ సందర్భంగా అమిత్ షా బండి సంజయ్ కు సూచించారని అంటున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించింది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పలు ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ హెలికాప్టర్ వినియోగించనున్నారు. సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు తెలుస్తోంది అయితే, కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ నిలవడంతో ప్రతిరోజూ రెండు సభల్లో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ చేరుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపడతారని అంటున్నారు.  బీజేపీ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ ను మించి ఉండాలనీ, కేసీఆర్ కు దీటుగా బండి సంజయ్ ప్రసంగాలు ఉండాలని అమిత్ షా బండికి సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.