ఈ సాయంత్రం చంద్రబాబు విడుదల.. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో బెజవాడకు | babu release evening| rjy to vijayawada| road| tirupati| tomorrow| hyd| lvprasad
posted on Oct 31, 2023 12:59PM
టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. అనారోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఉత్తర్వులు అందిన తర్వాత సాయంత్రం బాబును విడుదల కానున్నారు.
ఇప్పటికే చంద్రబాబు కుటుంబసభ్యులు నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ టీడీపీ శ్రేణులందరూ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోనున్నారు.
విజయవాడలో విశ్రాంతి తీసుకుని బుధవారం (నవంబర్1) తిరుపతి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. కంటి ఆపరేషన్ కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో అడ్మిట్ అవుతారు. ఇలా ఉండగా చంద్రబాబుకు మధ్యంతర బెయిలు రావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.