చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కుట్రే.. వైఎస్ ఆత్మ సంచలన వ్యాఖ్యలు! | bjp behind babu arrest| kvp| sensational| comments| center| jagan
posted on Oct 31, 2023 5:13PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్మెంట్ స్కాం పేరుతో అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు నిర్బంధించారు. ఎట్టకేలకు మంగళవారం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్, క్యాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే.. తొలి నుండి ఇది అక్రమ కేసేనని రిటైర్డ్ న్యాయమూర్తుల నుండి మాజీ ఐపీఎస్ ల వరకూ అందరూ చెప్తూనే వచ్చారు. అక్రమ అరెస్టు, అక్రమ కేసులే అయినా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అత్యధిక కాలం ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం.. ఒక ప్రభుత్వం ఇంత యథేచ్ఛగా ఇష్టారీతిగా, విలువలు, నిబంధనలను పట్టించుకోకుండా ఎలా ప్రవర్తించగలుగుతోందన్న అనుమానాలు మొదటి నుంచీ వెలువడుతూనే ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్దతూ లేకుండా ఇంతటి సాహసానికి దిగారంటే తొలి నుండి కూడా ఎవరూ నమ్మడం లేదు. ఏపీలో చీమ కుట్టాలన్నా కేంద్రం అనుమతి కావాల్సిందేనన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక చంద్రబాబు అరెస్టు అంశంలో కూడా బీజేపీ పెద్దల హస్తం తప్పకుండా ఉండి ఉంటుందనే అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఇప్పటికే పలువురు తెలుగుదేశం నేతలు ఇవే అనుమానాలను బాహాటంగానే వెల్లడించారు. ఇతర పార్టీలలో నేతలు, పలువురు అధికారులు కూడా ఈ అక్రమ అరెస్ట్ వెనక బీజేపీ అగ్రనాయకత్వం ఉందన్నదే తన అభిప్రాయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టుతో తమకు సంబంధం లేదని చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతలు సానుభూతి ప్రకటించినా.. ఈ అరెస్టులో కేంద్రం హస్తం, బీజేపీ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయమే బలంగా వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితుడిగా.. వైఎస్ ఆత్మగా పేరున్న రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం హస్తం ఉందన్న కేవీపీ.. జగన్ ని అడ్డం పెట్టుకొని కేంద్రం నాటకం ఆడుతుందని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. లోకేష్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని కేవీపీ ఘాటుగా విమర్శించారు.
విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేవీపీ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు వెనుక పెద్ద కథే నడిచిందన్నారు. చంద్రబాబు అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంగా ఆయన అభివర్ణించారు. సీఎం జగన్‌ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాటకంలో చంద్రబాబు పావుగా మారారని కేవీపీ అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్దల వ్యూహం ఉందని, కానీ, దీనిపై మాట్లాడేందుకు కొందరికి ధైర్యం సరిపోవడం లేదని కేవీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యవర్గ కార్యదర్శి నారా లోకేష్ కు అనేక రోజుల నిరీక్షణ తరవాత హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. ఈ అరెస్ట్ వెనక బీజేపీ నేతలు ఉన్నారనే దానికి అదే నిదర్శనమని కేవీపీ పేర్కొన్నారు.
గత ఏడాది కాలంగా బీజేపీ పెద్దలు తెలుగుదేశం మీద ఫోకస్ పెంచారు. దేశవ్యాప్తంగా మిత్రులు అందరినీ దూరం చేసుకున్న బీజేపీ మళ్ళీ వారిని దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఎవరూ నమ్మి ఎన్డీఏలో చేరడం లేదు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని బీజేపీకి అనుకూల జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. అది కూడా ఏకంగా చంద్రబాబు బీజేపీకి 40 సీట్లు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇది ఒకరకంగా బీజేపీ పాలిటికల్ గేమ్ ప్లాన్. అయితే బీజేపీ ప్రచారానికి చంద్రబాబు నుండి స్పందన రాకపోవడంతో జగన్ ను అడ్డం పెట్టుకొని ఇలా తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలను బలపరిచే విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేవీపీ లాంటి వాళ్ళు ఈ అరెస్టు బీజేపీ కుట్రేనని వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.