Leading News Portal in Telugu

బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ గూటికి జలగం ?


posted on Oct 31, 2023 12:27PM

భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. . ఈ రోజు సాయంత్రం జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీలో చేరిన జలగం వెంకట్రావు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అధికార పార్టీలో జలగం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని జలగం నిర్ణయించుకున్నారు. తన అనుచరులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశమై చర్చించి కాంగ్రెస్ నేతలకు ఓకే చెప్పారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ టికెట్ ను జలగం వెంకట్రావుకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

కొత్తగూడెం నుంచి 2014లో జలగం వెంకటరావు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈసారి టిక్కెట్ జలగం వెంకటరావు కు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రధాన మైన నేతలు బీఆర్ఎస్ ను వీడారు. జలగం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు.