అమ్మకానికి భారత పౌరుల బయోమెట్రిక్ డేటా!? | indian citizens bio metric data for sale| dark| web| personla| details
posted on Oct 31, 2023 11:37AM
దేశంలో పౌరుల వ్యక్తిగత భద్రతకు బాధ్యత వహించాల్సిన కేంద్రం చేతులెత్తేసిందా? కేంద్ర సంస్థల వద్ద గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత డేటా అమ్మకానికి సిద్ధమైపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య భద్రత దృష్ట్యా సేకరించిన పౌరుల బయో మెట్రిక్ వివరాలు డార్క్ వెబ్ లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఆ వెబ్ సైట్ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో షాక్ కు గురైన ప్రభుత్వ వర్గాలు వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాయి.
కోవిడ్ సమయంలో ఐసీఎమ్ఆర్, ఎన్సీఐ సేకరించిన డేటా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చేరాయి. ఈ విరాలు అక్కడ నుంచే లీక్ అయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ వివరాలు ఎలా లీక్ అయ్యాయి. ఎవరి ద్వారా లీక్ అయ్యాయి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. ఇలా ఉండగా మొత్తం 81 కోట్ల 5 లక్షల మంది భారత పౌరుల బయో మెట్రిక్ డేటాను డార్క్ వెబ్ విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించడమే కాకుండా ఆందోళనకు గురి చేస్తున్నది.
ఆధార్ వివరాల గోప్యత ప్రమాదంలో ఉందన్న అనుమానాలు గతం నుంచీ వ్యక్తమౌతున్నా కేంద్రం పట్టిచుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌరుల వ్యక్తిగత వివరాలు లీక్ అవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.