posted on Oct 31, 2023 10:38AM
అవును, ఆయనేమీ దేవుడు కాదు, ఇంద్రుడు కాదు , చంద్రుడు కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఎక్కడెక్కడి నుంచో, ఎవరెవరో వచ్చి ఆయన కోసం గళం విప్పడం ఏమిటి? కులం గోత్రాలతో, రాజకీయ రంగులతో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒకటిగా ఆయన కోసం గళం విప్పడం ఏమిటి? నిజంగా నడుస్తున్న చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం. ఒక అద్భుత దృశ్యం.
రాజకీయ కక్షతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్రలో చిక్కుకుని,యాభై రోజులకు పైగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు గుర్తు చేసింది. మరో మారు ప్రపంచం కళ్లకు కట్టింది.
అవును, రెండురోజుల క్రితం ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సైబర్ టవర్స్ రజతోత్సవ’ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో,పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం దర్శనమిచ్చింది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్ భవితకు బంగరు బాటలు పరిచిన విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పింది. గర్జించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం కొత్త చర్చకు తెర తీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు ఇప్పడు ఎక్కడున్నా, ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నరనే విషయాన్ని ఈ ఈవెంట్ రుజువు చేసింది. వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు పెద్ద ఎత్తున వినిపించాయి.
నిజానికి ఆదివారం జరిగింది, చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పండగో, పెళ్లిరోజు వేడుకో కాదు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమం కాదు. అసలు రాజకీయాలతో సంబంధమే లేని కార్యక్రమం. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అవుతున్న వేళ.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా ఉన్నాయి. అందుకే, బావోద్రేకంతో ఒకరిద్దరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా, మాట్లాడిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు దార్శనికత గురించే మాట్లాడారు.
ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా వట వృక్షమై, తమవంటి లక్షల మందికి ఎలా నీడను అందిస్తున్నదో, దేశ విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు.
జనసామాన్యం చంద్రబాబును తమ తల్లిదండ్రులతో, అంత కన్నా మిన్నగా దేవుడితో సమానంగా ఎలా చూస్తారో సోదారహరంగా వివరించారు. ఒక డ్రైవర్ రోజూ తాను అన్నం తినే ముందు తల్లిదండ్రులతో సమానంగా భావించే చంద్రబాబు కోసం ఓ ముద్ద వదిలి మరీ తాను తింటాడు. తెలుగు ఇళ్లళ్లో వ్రతాలు, పూజలూ చేయడం కద్దు. అలా చేసిన ప్రతి సారీ దేవుడి ఆకును ఉంచి.. వండిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలాగే చంద్రబాబు విజన్ వల్ల తమ జీవితాలు నిలబడ్డాయని భావించచే ప్రతి ఉద్యోగీ, వారి కుటుంబం చంద్రబాబును దేవుడితో సమానంగా భావిస్తారనడానికి ఆ డ్రైవర్ తాను తినే ముందు ఒక ముద్దను చంద్రబాబుకు నైవేద్యంగా సమర్పించడమే నిదర్శనం.
నిజానికి, హైటెక్ సిటీ అంటే, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రమే గుర్తు కొస్తారు. ఆ నిజాన్ని ఎవరూ కాదన లేరు. నిజానికి, రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అంటే ఆది చంద్రబాబు చలవే తప్ప మరొకటి కాదు. ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. చంద్రబాబు మానస పుత్రిక విజన్ 2020 పుణ్యానే, ఈరోజున హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది. అయితే ఆ రోజుల్లోకి వెళితే ఒక నొక సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నట్లుగా ఆరోజుల్లో విజన్ 2020 అంటే.. 420 అని ఎగతాళి చేశారు. కానీ ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తున్న విజన్ 2020 ఫలాలను ఎవరూ కాదన లేరు.. ఎవరో కాదు..అసలు ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు సైతం.. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణమని ఒక సారి కాదు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అందుకే, ఈరోజున చంద్రబాబు నాయుడుకు ఐటీ రంగం జేజేలు పలుకుతోంది. బాబంటే ఐటీ ..ఐటీఅంటే బాబు అంటోంది ఐటీ ప్రపంచం.