సైకిలెక్కనున్నబాలినేని, మాగుంట?.. ఉమ్మడి ప్రకాశంలో తెలుగుదేశం క్వీన్ స్వీప్ పక్కా! | magunta balineni to join tdp| combined| prakasham| district| ycp| loose| all
posted on Nov 1, 2023 7:13AM
సుమారు రెండు నెలల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకి వచ్చారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. పూర్తి స్థాయి బెయిల్, క్యాష్ పిటిషన్ పై కోర్టులలో ఇంకా విచారణ జరుగుతుండగా.. వీటిలో కూడా చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ అక్రమ కేసులు కావడంతోనే కాస్త ఆలస్యమైనా ఈ కేసులు నిలబడవన్నది సీనియర్ న్యాయ నిపుణుల భావన. ప్రస్తుతానికి చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, కేసుకు సంబంధించిన వ్యక్తులకు దూరంగా ఉండాలని కోర్టు నిబంధనలను విధించింది. అయితే, చంద్రబాబు జైలు నుండి విడుదల అనే వార్తతోనే టీడీపీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. దీంతో బుధవారం (నవంబర్ 1) నుండి టీడీపీ అసలైన సమరశంఖం పూరించనున్నట్లు కనిపిస్తుంది.
నిజానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాకుండా ఉంటే ఈ పాటికి వైసీపీ నుండి టీడీపీకి భారీగా వలసలు ఉండేవి. చంద్రబాబు అరెస్టుకు ముందు 15 నుండి 20 మంది కీలక వైసీపీ నేతలు టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉండేవారు. ఈ సంగతి రెండు పార్టీలలో కూడా అందరికీ తెలిసిందే. అయితే, చంద్రబాబు అరెస్టుతో అప్పుడు ఈ వలసలకు బ్రేకులు పడ్డాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు బయటకి రావడంతో టీడీపీలో జోష్ పెరగడమే కాదు.. తెలుగుదేశం వైపు చూసే వైసీపీ నేతలు సైకిలెక్కే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. తెలుగుదేశం కూడా వైసీపీ కీలక నాయకులకు చేర్చుకొని గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి కీలక చేరికలు ఉండనున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో, అంతటి కఠిన పరిస్థితులలో కూడా ప్రకాశం జిల్లాలో 4 సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది. ఈసారి ఎలాగైనా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న టీడీపీ అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ కీలక నేతలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా వైసీపీలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాలినేనిని మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీలో కూడా అతనికి అధికారాలు లేకుండా చేయడం, అదే సమయంలో వైవి సుబ్బారెడ్డి పట్టు బిగిస్తుండడంతో ఇక్కడ వైసీపీ రెండు వర్గాలు నిలువునా చీలిపోయింది. సుబ్బారెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని బాలినేని బట్టబయలు చేసి పార్టీలో దుమారం రేపారు. ఇప్పటికే పలుమార్లు వైసీపీ పెద్దలు బాలినేనిని బుజ్జగించగా.. తాజాగా మరోసారి రాయబారం కూడా పంపినట్లు తెలుస్తున్నది. అయితే, బాలినేని మాత్రం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. బాలినేనితో పాటు ఎంపీ మాగుంట కూడా తెలుగుదేశంలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా ఎంపీ మాగుంటకు పార్టీలో పరాభవం జరుగుతుండగా బాలినేని ఆయనకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి వైసీపీని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే ఈ జిల్లాలో తెలుగుదేశం ఈసారి క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ 8 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి 12కి 12 తెలుగుదేశం గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా వ్యక్తమవుతోంది. దీనికి తోడు వైసీపీలో అంతర్గత విబేధాలు కూడా తోడై కీలక నేతలే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. జిల్లాల విభజన అంశంలో కూడా ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు సీఎం జగన్ ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేరలేదు. పైగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు జిల్లాలో అక్రమాలు, అరాచకాలకు దిగారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో ఒంగోలు, కందుకూరు లాంటి వైసీపీ కీలక స్థానాలు చేయిజారిపోనున్నాయని అంటున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలైతే కనీస ప్రజల కంటికి కూడా కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి ప్రకారం జిల్లాను వైసీపీ మర్చిపోవాల్సిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.