తెలంగాణ ఎన్నికల తరువాత షర్మిల అడుగులు ఏపీవైపు.. హస్తం ఆహ్వానించేనా? | sharmila to join congress after ts elections| party| candidates| win| telangana| hopes
posted on Nov 1, 2023 11:33AM
తెలంగాణ ఎన్నికలు ఇక రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలతో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచార సన్నాహాలూ పూర్తి చేసుకుని ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది. వేరే వేరే పార్టీలోని అసమ్మతి వాదులైనా తన పార్టీ టికెట్ కోసం వస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోంది. అయితే అటువంటి సంకేతాలేమీ ఎక్కడ నుంచీ కానరావడం లేదు. వైఎస్సార్టీపీ తరఫున తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగడానికి ఆమె వినా మరెవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తన తల్లి, భర్త అవసరమైతే పోటీ చేస్తారని గతంలో ప్రకటించిన షర్మిల ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని గమనించి వారిద్దరినీ పోటీలోకి దింపడం సరికాదని షర్మిల స్వయంగా భావించారో.. లేక వారే పోటీకి వెనకడుగు వేశారో కానీ ఇప్పుడు విజయమ్మ, బ్రదర్ అనిల్ ల పోటీ ఊసెక్కడా వినిపించడం లేదు.
సరే అదలా ఉంచితే.. ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల.. ఆ తరువాత ఏపీ రాజకీయాలకు దూరం అయ్యారు. దూరం అయ్యారనే కంటే తాను ఎంతో కష్టపడి అన్న జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడితే..అధికార అందలం అందుకున్న తరువాత జగన్ షర్మిలను కూరలో కరివేపాకులా తీసి పారేసి ఏపీకి దూరం చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. స్వయంగా షర్మిల కూడా పలు సందర్భాలలో అదే భావన వ్యక్తం చేశారు. సరే 2019 ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ వ్యాప్తంగా తిరిగిన షర్మిల.. ఆ ఎన్నికల ఫలితాల తరువాత.. జగనన్న వదిలేసిన బాణంలా మిగిలిపోయారు.
ఏపీ నుంచి తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర అంటూ గమ్యం లేకుండా తెలంగాణ అంతా నడిచేశారు. మధ్యమధ్యలో ఒక రోజు దీక్షలూ చేశారు. ఒకటి రెండు సార్లు అరెస్టయ్యారు కూడా. అయితే తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకువస్తామంటూ ఆమె చేసిన రాజకీయం ప్రజలను పెద్దగా మెప్పించలేదు. దీంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆమె కాంగ్రెస్ వైపు చూశారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకుండా ఏపీకి పరిమితం కావాలన్న కాంగ్రెస్ షరతును అంగీకరించకపోవడంతో అందినట్లే కనిపించి హస్తం కూడా దూరం జరిగింది. ఇప్పుడు గురి ఏమిటో కూడా తెలియని బాణంలా షర్మిల మిగిలిపోయారు.
ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం మాట అటుంచి.. కనీసం తాను నిలబడే స్థానంలోనైనా విజయం సాధిస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.
దీంతో ఆమె తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో కాలుపెట్టే అవకాశాలను తీవ్రంగా పరిశీలుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాజకీయాలు దూరం అయ్యి.. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ ను తెలంగాణ ఎన్నికల తరువాత ఆమె అంగీకరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే దాని వల్ల షర్మిలకు ఒనగూరే ప్రయోజనం ఎలా ఉన్నా.. కాంగ్రెస్ లబ్ధి పొందుతుందనీ, అదే సమయంలో జగన్ కు మాత్రం తేరుకోలేని, పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.