Leading News Portal in Telugu

కృష్ణాతీరంలో. వైసీపీ కార్పొరేటర్ భర్త గోదావరి బాబుకి దేహశుద్ది | ycp corporator husband| beaten for pick pocketing| vijayawada| benz| circle| tdp| welcome


posted on Nov 1, 2023 3:15PM

 ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (అక్టోబర్ 31)రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన రాజమండ్రి నుండి విజయవాడ కరకట్ట సమీపంలో ఉన్న తన నివాసానికి కాన్వాయితో బయలుదేరారు. ఆ క్రమంలో రహదారిపైకి భారీగా ప్రజలు చేరుకోన్నారు. అయితే విజయవాడ బెంజిసర్కిల్ వద్ద జేబు దొంగలు హల్‌చల్ చేశారు.

ఓ టీడీపీ కార్యకర్త జేబులోని సెల్ పోన్‌తోపాటు రూ. 20 వేల నగదు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. సదరు దొంగను పట్టుకొని.. దేహశుద్ది చేసి.. విజయవాడ నగర పోలీసులకు అప్పగించారు. అయితే నగదు దొంగిలించి పారిపోతున్న వ్యక్తి విజయవాడ నగరంలోని 37వ డివిజన్ కొత్తపేట కార్పొరేటర్, వైసీపీ నాయకురాలు గోదావరి గంగ భర్త గోదావరి బాబు అని గుర్తించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు ఈ ఘటన నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు బెంజి సర్కిల్ వద్ద  చోటుచేసుకుంది.

మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో గోదావరి బాబుపై కేడీ షీట్ ఉందని తెలుస్తోంది. జేబు దొంగతనాలు, రద్దీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ల చోరీ చేయడంలో ఈ గోదావరి బాబు ఆరితేరిపోయాడన్న ప్రచారం అయితే  స్థానికంగా హల్‌చల్ చేస్తోంది. అయితే అతడి భార్య గత మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం.  

ఓ వైపు భార్య ప్రజా ప్రతినిధిగా ఉన్నా.. ఆమె భర్త గోదావరి బాబు మాత్రం పాత వృత్తిని వదులుకోకపోవడంతో.. ఈ ఘటన జరిగిందనే ఓ ప్రచారం అయితే నగరంలో వాడివేడిగా నడుస్తోంది. అదీకాక చంద్రబాబు నాయుడు కాన్వాయి బెంజిసర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో టీడీపీ శ్రేణులు జోష్‌లో ఉండటాన్ని గుర్తించిన గోదావరి బాబు.. అదే సమయం అనుకొని.. ఓ టీడీపీ కార్యకర్త జేబులో నుంచి సెల్ ఫోన్, నగదు దొంగిలించి.. పక్కనే ఉన్న తన సన్నిహితుడికి ఇచ్చి.. అక్కడి నుంచి చల్లగా జారుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ శ్రేణులు గుర్తించి.. వెంటనే గోదావరి బాబును పట్టుకొని.. బాగా దేహశుద్ది చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. స్థానిక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారిలో చాలా మంది నేరచరితులు, కాల్ మనీ వ్యాపారులు, చిల్లర దొంగలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.