బాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ | bike rally in hyderbad| babu| support| begampet| airport| cbn
posted on Nov 1, 2023 1:46PM
స్కీల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ఆయనకు మద్దతుగా బాస్ ఈజ్ బైక్ పేరుతో హైదరాబాద్ మహానగరంలో బైక్, కారు ర్యాలీనీ తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. ఈ బైక్ ర్యాలీ సాయింత్రం 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని నారా చంద్రబాబు నాయుడు నివాసం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బాబు అభిమానులకు, పార్టీ నాయకులకు, ఐటీ ఉద్యోగులకు, అలాగే పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. జగన్ ప్రభుత్వం సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసింది. దీంతో పోలీసులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకు రిమాండ్ విధించడంతో.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నాటి నుంచి ఆయన ఆ జైలులోనే ఉన్నారు. అయితే అక్టోబర్ 31వ తేదీన చంద్రబాబుకు హైకోర్టు కండిషన్ బెయిల్ మంజురు చేయడంతో.. ఆయన జైలును విడుదలయ్యారు.
మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం ఆందోళనలు, ధర్నాలు నిరసనలు ఉదృతంగా కొనసాగాయి. మరోవైపు న్యాయస్థానాల్లో సైతం ఆయన క్వాష్, బెయిల్ పిటిషన్లపై వాయిదాల పర్వం కొనసాగింది. అటువంటి వేళ నారా చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఆయన అక్టోబర్ 31 సాయంత్రం 5.00 గంటలకు జైలు నుంచి విడుదలై.. నవంబర్ 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఇంకోవైపు రాజమండ్రి నుంచి కరకట్ట మీద ఉన్న నివాసం చేరుకొనే క్రమంలో చంద్రబాబుకు ప్రజలు నిరాజనాలు పలికారు.