అక్రమాస్తుల కేసులో కదలిక.. జగన్కు కొత్త టెన్షన్!? | new tenssion to jagan| cases| another| state| ycp| rebel| mp| petition| supreme
posted on Nov 2, 2023 1:22PM
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి మొదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండగా ఏపీలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో జరగనున్నాయి. అంటే ఏపీలో కూడా ఐదు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే విపక్ష తెలుగుదేశం దూకుడు మీద ఉండగా.. జనసేన కూడా తెలుగుదేశంకు తోడు కావడంతో అధికార వైసీపీలో ఓటమి భయం ముప్పిరి గొంది.
ఇప్పటికే ముందస్తు సర్వేలు, ప్రజల అభిప్రాయాలతో వైసీపీ ఓటమి ఖరారైనట్లేనని నివేదికలు బయటకు వస్తున్నాయి. దీంతో వైసీపీ లో నిరుత్సాహం అలముకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో ఉత్సాహం నింపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా విపక్షాల జోరు ముందు అవేమీ ఆనడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసి.. ఆయనను జనానికి దూరం చేశామని అధికార వైసీపీ భావించినా.. ఆ అరెస్టు జనంలో వైసీపీపై వ్యతిరేకత మరింత పెరగడానికీ, తెలుగుదేశం పట్ల అభిమానం వెల్లువెత్తడానికీ మాత్రమే దోహదపడింది. మధ్యంతర బెయిలుపై చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత జనం ఆయనకు బ్రహ్మరథం పట్టిన తీరు చూసిన వైసీపీ శ్రేణులకు సినిమా అర్ధమైపోయింది. అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీకి , ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను సుప్రీం శుక్రవారం విచారించనుంది. జగన్ పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని తన పిటిషన్ లో పేర్కొన్న రఘురామకృష్ణం రాజు.. ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేఛ్చను ఇచ్చారని.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో జరపాలని తన పిటీషన్లో కోరారు.
కాగా జగన్ అక్రమాస్తుల కేసుతో రఘురామ సుప్రీం తలుపు తట్టడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది. ఈ పిటిషన్ శుక్రవారం (నవంబర్ 3) విచారణకు రానుంది. జగన్ కేసుల విషయంలో విచారణ జాప్యం మీద సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. పిటిషనర్ ఎంపీ రఘురామ కోరినట్లుగా వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒక వేళ ఉంటే ఏ రాష్ట్రానికి ఈ కేసు బదిలీ చేసే అవకాశం ఉంది అన్న చర్చ జోరందుకుంది. సుప్రీం ఈ కేసుపై అడిగే ప్రశ్నలకు సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది.. ఎందుకు విచారణ ఇంత ఆలస్యమవుతుందంటే ఏ చెప్పనుందన్నది ఆసక్తిగా మారింది.
ఈ కేసులో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే అవుతుంది. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. సీబీఐ కోర్టు విచారణకు జగన్ రావాల్సిందేనని నోటీసులు ఇచ్చినా కూడా అది జనగ్ కు ఇబ్బందికరంగానే మారుతుందనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మళ్లీ జగన్ కేసులపై జనం దృష్టి మళ్లడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. స్కిల్ కేసులో చంద్రబాబు గొప్పతనంపై జనంలో చర్చ జరిగింది. అదే జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వస్తే.. జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి అంశాలపై జనంలో చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు భగం వాటిల్లడమే కాకుండా.. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. అసలే చంద్రబాబు అక్రమ అక్రమ అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులు ఇప్పటికే పదే పదే జగన్ కేసులను ప్రస్తావిస్తున్నాయి. జగన్ బెయిలు దశాబ్ద ఉత్సవాలు అంటూ సెటైర్లు కూడా వేశాయి. ఇలాంటి సమయంలో సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఒకవేళ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ విచారణకు రావాల్సిందేనని ఆదేశిస్తే.. అది జగన్ ప్రతిష్టకు డ్యామేజీ అవుతుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా ఈ కేసు భవితవ్యం ఏంటన్నది ఈ శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చనుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది. సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అన్న విర్గాలలో వ్యక్తం అవుతోంది.