Leading News Portal in Telugu

బిజెపి మూడో జాబితా… చాన్స్ కొట్టేసిన  బాబు మోహన్ , కృష్ణాయాదవ్ 


posted on Nov 2, 2023 4:05PM

ఎట్టకేలకు బిజెపి మూడో జాబితా విడుదలైంది. 52తో మొదటి జాబితా విడుదల చేసిన బిజెపి రెండో జాబితాలో కేవలం ఒకే అభ్యర్థిని ప్రకటించి అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీలో వలసవెళ్లే విధంగా వ్యవహరించింది. టిడిపి హాయంలో ఆందోల్ ఎమ్మెల్యేగా గెలిచిన సినీ నటుడు బాబు మోహన్ కొద్ది రోజుల్లోనే మంత్రయ్యారు కూడా.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కెసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో చేరారు.   2014లో టిఆర్ఎస్ ఆందోల్ టికెట్ పై గెలిచినప్పటికీ రెండో సారి(2018) మాత్రం బాబు మోహన్ కి ఇవ్వకుండా జర్నలిస్ట్ క్రాంతికిరణ్ కు ఇవ్వడంతో బాబు మోహన్ బిజెపిలోకి జంప్ అయ్యారు. అక్కడ పోటీ చేసి పరాజయం చెందారు. దీంతో బిజెపి అధిష్టానం బాబు మోహన్ కి  ఈ సారి టికెట్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూప లేదు. పైగా తన కొడుకుకు ఇస్తామని చాల రోజుల వరకు దాటవేసింది. మనస్థాపం చెందిన బాబు మోహన్ ప్రెస్ మీట్ పెట్టి బిజెపి పై నిప్పులు చెరిగారు. కుటుంబంలో చిచ్చు పెట్టిందని విమర్శించారు.  అసలు ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఏ పార్టీలో చేరే విషయం త్వరలో వెల్లడిస్తానని అధిష్టానాన్ని బెదిరించినంత పని చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో నిన్ననే విడుదల చేస్తారని భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ రోజు 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.  బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి తదితరులకు టిక్కెట్ వచ్చింది.