కామారెడ్డిలో కేసీఆర్ కు పౌల్ట్రీ రైతుల నిరసన సెగ.. వంద నామినేషన్లు వేయడానికి నిర్ణయం | poultry farmers to file nominations| kamareddy| kcr| protest| big
posted on Nov 3, 2023 6:08AM
తెలంగాణ ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి ఏదీ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు కామారెడ్డిలో రైతులు షాక్ ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్స్ వేయడానికి సిద్ధపడుతున్నారు.
కార్పొరేట్ శక్తుల తీరుతో అన్యాయానికి గురవుతున్నామని పేర్కొంటూ కామారెడ్డి నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా పౌల్ట్రీ రైతులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు గురువారం (నవంబర్ 2)కామారెడ్డిలోని పద్మశాలీ సంఘం భవనంలో జరిగిన పౌల్ట్రీ ఫార్మర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఫౌల్ట్రీ రైతులకు చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ కూడా మద్దతు తెలిపారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న తమ డిమాండ్ కు అధికార బీఆర్ఎస్ పట్టించుకోలేదనీ, రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలని కోరినా ఫలిలం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలనీ. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారనీ, ఆ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్ల పౌల్ట్రీ రైతులు చెప్పారు.శుక్రవారం (నవంబర్ 3) నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు.