posted on Nov 3, 2023 10:23AM
సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఈ రెండు పేర్లు గత 53 రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చాలా ఎక్కువగా వినిపించిన పేర్లు. మీడియాలో ఎక్కువగా కనిపించిన పేర్లు. అయితే వీరేం రాజకీయ నాయకులు కారు. వీరిరువురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ కాగా.. మరొకరు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్. తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్ట్ నుండి స్కిల్ కేసు న్యాయస్థానాలలో విచారణ వరకూ ఈ ఇద్దరూ ఎక్కడా నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లుగా వ్యవహరించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని అందరూ నిర్ధారించారు. 17ఏ సెక్షన్ కింద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నేతను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ చంద్రబాబు అరెస్టు కనీసం గవర్నర్ కు సమాచారం కూడా ఇవ్వకుండానే అర్ధరాత్రి ఆయన బస చేసిన శిబిరాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకూ అసలు ఎఫ్ఐఆర్ అనేదే లేకుండా ఈ అరెస్ట్ జరిగింది. కోర్టులో విచారణ మొదలయ్యాక హడావుడిగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు చంద్రబాబును సీఐడీ విచారణకు అప్పగించినా ఈ కేసులో ఆయన పాత్ర లేకపోవడంతో సీఐడీ విచారణ కూడా వృధానే అయింది.
మొత్తం 52 రోజులుగా ఏసీబీ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ ఈ కేసులో విచారణ సాగినా.. ఎక్కడా స్పష్టమైన ఆధారాలు సీఐడీ న్యాయస్థానాలకు అందించలేకపోయింది. పైగా జైల్లో చంద్రబాబు సదుపాయాలపై కూడా సీఐడీ ఎక్కడిక్కడ అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీనిని బట్టి చూస్తే సీఐడీ కేవలం ప్రభుత్వ పెద్దల ఆనందం కోసమే పనిచేస్తున్నదనీ, ప్రభుత్వ కక్షసాధింపులో సీఐడీ పావుగా మారిందని అందరికీ స్పష్టంగా అర్ధమైంది. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కార్ ఇలా వేధింపుల కోసమే సంజయ్ ను సీఐడీ చీఫ్ గా నియమించుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతకు ముందు విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కు సీఐడీ అదనపు బాధ్యతలు అప్పగించి మరీ జగన్ సర్కార్ తీసుకొచ్చింది.
గతంలో సంజయ్ పై రాయలసీమలో పనిచేసే సమయంలోనే వైసీపీ వాదిగా ముద్ర ఉంది. ఇక ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసు మొదలైన దగ్గర నుండి ఈయన ఏఏజీ లా కంటే.. వైసీపీ కార్యకర్తలానే ఎక్కువగా వ్యవహరించారు. ఈ కేసు విచారణ మొదలైన తొలి రోజు నుండే మీడియాకెక్కిన పొన్నవోలు నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి చంద్రబాబు దోషి అంటూ రచ్చ రచ్చ చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా.. అదే కేసులో వాదనలు వినిపించే న్యాయవాది కేసుకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన తెలిసినా అడ్డగోలుగా మీడియా చర్చలో పాల్గొన్నారు. అసలు పసలేని కేసులో భారీ కుంభకోణం అనేలా చిత్రీకరించేందుకు సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు శాయశక్తులా కృషి చేశారు. నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ఈ కేసు గురించి జాతీయ స్థాయి మీడియాకు వివరణ ఇచ్చిన అనంతరం సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ప్రభుత్వ డబ్బుతో ఢిల్లీ వెళ్లి అక్కడా చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్రవేసేందుకు కేసు వివరాలను వెల్లడిస్తూ మీడియా సమావేశాలలో మాట్లాడారు.
ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డిలు మీడియా సమావేశాలు ఏర్పాటు కేసు గురించి మాట్లాడారనీ, ఆ క్రమంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాధనం దుర్వినియోగంపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆర్టీఐ కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమేనని పేర్కొంది. మరో సారి ఆర్టీఐని వివరాలు ఇవ్వాలని కోరాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది. ఇక తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో కూడా హైకోర్టులో పొన్నవోలు వితండవాదం వినిపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదని పొన్నవోలు హైకోర్టులో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా హైకోర్టు ఆగ్రహించింది. మార్గదర్శకాల ప్రకారమే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళమని సూచించింది. అంతే కాదు కోర్టు తీర్పులు ఎలా ఇవ్వాలో కూడా మీరే చెప్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు అధికారుల ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారన్నది తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.