చంద్రబాబు పేరు వింటేనే జగన్ సర్కార్ గజగజ! | jagan sarkar fear even to hear babu name| illegal| cases| recent| sand| madyam| skill
posted on Nov 3, 2023 12:02PM
వైసీపీ ఓటమి ఖరారైంది.. జగన్ మోహన్ రెడ్డిని ఈసారి ప్రజలు తిరస్కరించి ప్యాలెస్ కి పరిమితం చేయడం గ్యారంటీ. తెలుగుదేశం అధికారంలోకి రావడం తధ్యమన్న ప్రజా నాడి సర్వేల రూపంలో బయటపడింది. పడుతోంది. వైసీపీకీ ఎక్కడిక్కడ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సొంత నేతలే పార్టీకి మొహం చాటేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే ఉంటే ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుందనే భయంతో నేతలలో చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సమయానికి కనీసం చాలా స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవనే భయం అధిష్టానం పెద్దలను కూడా వెంటాడుతుంది. దీంతో ఎలాగైనా ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు వైసీపీ సర్కార్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అక్రమమా.. సక్రమమా, మంచా, చెడ్డా అన్నది అనేది పక్కన పెట్టి తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పరిమితం చేసేలా కుట్రలు పన్నారు. పన్నుతున్నారు. కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పేరు లేని స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించి 52 రోజుల పాటు జైలుకు పరిమితం చేశారు. ఈ కేసు నేటికీ విచారణలోనే ఉండగా మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు.
స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ వస్తుందని భావించగానే ఏపీ సర్కార్ అప్పటికపుడు ఆయనపై వరస కేసులను సిద్ధం చేసింది. స్కిల్ స్కాం పేరుతో అక్రమ అరెస్ట్ చేసిన సమయంలోనే ఆయన ఎక్కడ జైలు నుండి బయటకి వస్తారోనని.. అమరావతి రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు అంటూ వరసగా అక్రమ కేసులు బనాయించి ఒక కేసులో ఆయన బయటపడినా మరో కేసులో అరెస్ట్ చేసేలా వల పన్నారు. అయితే, స్కిల్ కేసు తర్వాత ఏ కేసులో నూ జగన్ సర్కార్, ఏపీ సీఐడీ కుట్రలు పారలేదు. అంతటితో ఆగని జగన్ సర్కార్ చంద్రబాబుకు బెయిల్ వస్తుందన్న సమాచారంతో అప్పటికప్పుడు మద్యం అక్రమ అనుమతులు అంటూ మరో కేసును తెరమీదకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున్యాయవాదులు ముందే న్యాయస్థానాల తలుపు తట్టడంతో సీఐడీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయబోమని కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. ఆ కేసులో అయితే వెనక్కు తగ్గారు కానీ.. వదల బాబూ అంటూ సీఐడీ మాత్రం చంద్రబాబు అరెస్టుకు కుట్రపూరితంగా వరస కేసులను నమోదు చేస్తూనే వస్వోంది.
లిక్కర్ కేసులో పసలేదని తేలిందో లేదో వెంటనే ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ మరో కేసును తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వ హయంలో ఇసుక రవాణా, అనుమతులు ఎలా సాగాయన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అతి ముఖ్యమైన ఇసుకను ఉచితంగా అందించి చంద్రబాబు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. చంద్రబాబు సర్కారు 2016-2019 వరకు పేదలకు ఉచిత ఇసుక విధానం అమలు చేసింది. కానీ ఇప్పుడు అందులోనే జగన్ సర్కారుకు కుట్రకోణం కనిపించింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల గనుల శాఖ సీనరేజీ ఫీజు, కన్సిడరేషన్ ఫీజు, ఇతర ఫీజుల రూపంలో నష్టం వాటిల్లిందని పేర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకం ద్వారా 766 కోట్ల ఆదాయాన్ని సంపాదించామని చెబుతోంది. గత నెల అక్టోబర్ 3వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఈ కేసును ఫైల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో తెలుగుదేశం ముఖ్య నేతలతో పాటు అప్పటి సీఎం చంద్రబాబును ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
జగన్ సర్కార్ తీరు చూస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. తప్పు ఒప్పు, నియమం, నిబంధన అంటూ ఏమీ అక్కర్లేదు.. వరుస కేసులతో చంద్రబాబును ఏలాగోలా అరెస్టు చేసి జైలుకు పరిమితం చేయడమే జగన్ సర్కార్ లక్ష్యంగా కనిసిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు బయట ఉంటే కష్టమని జగన్ భయపడుతున్నారని అందుకే ఏదో ఒకటి చేసి ఆయనను జైలుకు పరిమితం చేసి ఎన్నికల పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు. అందుకే ఇలా వరస అక్రమ కేసులతో చంద్రబాబును ఇబ్బంది పెట్టే కుట్రకు తెరతీశారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రజల్లో పెరిగిన సానుభూతికి అడ్డుకట్ట వేయడానికి కూడా తిరిగి జగన్ సర్కార్ అడ్డదారినే నమ్ముకోవడం చూస్తుంటే వైసీపీ ఎంతకైనా దిగజారడానికి రెడీ అయిపోయిందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
నాలుగేళ్లుగా ఇసుకను అప్పనంగా దోచేస్తున్నదెవరో ప్రజలకు తెలియదా? ఉచిత ఇసుక కూడా జగన్ కు కుట్రగా కనిపించడం అంటే తనకు అంటిన అవినీతి మరకలన్నీ కూడా చంద్రబాబు అంటించాలన్న దురుద్దేశమే కనిపిస్తున్నదంటున్నారు. వేధించు.. బాధించు.. భయపెట్టు అనే సిద్ధాంతాలను నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి అవాస్తవ కథనాలు వండి వార్చి అక్రమ కేసులు బనాయించినా జనం నమ్మే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదన్నది వాస్తవం. వరుస కేసులతో మరింత ప్రజా వ్యతిరేకతను ప్రొది చేసుకోవడం తప్ప జగన్, ఆయన ప్రభుత్వం సాధించగలిగేదేమీ ఉండదని చెబుతున్నారు.