వర్మ వ్యూహం విడుదలకు నోచుకునేనా? | sensor troubles to vyuham| revising| committee| refer| rgv| political| babu| jagan
posted on Nov 3, 2023 2:28PM
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు, ఇప్పుడు జీరో స్థాయికి మించి అగాధంలోకి పడిపోయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీ సీఎం జగన్ రెడ్డికి అనుకూలంగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపించేందుకే వ్యూహం సినిమా తెరకెక్కించారు. ఈ విషయాన్ని పలు సందర్భాలలో స్వయంగా రామ్ గోపాల్ వర్మే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా చెప్పేశారు.
వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చంద్రబాబే మెయిన్ విలన్ అన్నట్లుగా కథ నడిపించినట్లు ప్రచారంలో ఉంది. మధ్య మధ్యలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ వంటి వారికి సంబంధించి కూడా వ్యతిరేకంగానే చూపారని సినీ వర్గాలలో ప్రచారం అయ్యింది. మొత్తంగా వక్రీకరించిన కథతో సినిమా తెరకెక్కిస్తే అది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది తెలిసిందే. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలకు లభించిన ఆదరణ అందరికీ విదితమే. అది పక్కన పెడితే.. అసలు వ్యూహం విడుదలకు నోచుకుంటుందా? సెన్సార్ అందుకు అనుమతిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచీ వ్యక్తం అవుతూనే వస్తున్నాయి.
ఇప్పుడు అందరూ భావిస్తున్నట్లే ఈ సినిమాకు సెన్సార్ బ్రేకులు వేసింది. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వకుండా రివైజింగ్ కమిటీకి రిఫర్ చేసింది. లోకేష్ వ్యూహం సినిమా పై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాశారు.దీనితో సెన్సార్ బోర్డు ఈచిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. అంతే కాకుండా.. రివైజింగ్ కమిటీకి ఎప్పుడు పంపిస్తారు.. కమిటీ ఎప్పుడు రివ్యూ చేస్తుంది అన్నది కూడా సెన్సార్ బోర్డు మెన్షన్ చేయలేదు.
దీనిపై స్పందించిన దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమా విడుదలపై కోర్టులకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని చెబుతున్నారు. అది వేరే సంగతి. ఈ లోగా మరో నిర్మాత నట్టి కుమార్ ఈ సినిమాపై స్పందించారు. ప్రస్తుతం సెన్సార్ రివైజింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న సినీ నటి, దర్శక నిర్మాత, రాజకీయాలలో కూడా పాత్ర ఉన్న జీవితను ‘వ్యూహం’ సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీలో లేకుండా చూడాలని నిర్మాత నట్టి కుమార్ ఓ లేఖ రాశారు. అందుకు కారణాలు కూడా వివరిస్తూ లేఖ విడుదల చేశారు.
నట్టి కుమార్ ఈ సినిమా విడుదల ఆపాలని ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీలో జీవిత రాజశేఖర్ నాయకురాలిగా ఉన్నందున్న ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా సెన్సార్ చేయమని సహజంగానే వత్తిడి చేస్తారనీ, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహం సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీ నుంచి జీవితని తప్పించాలని నట్టి కుమార్ సెన్సార్ బోర్డును కోరారు.
అయితే తనపై నట్టి కుమార్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీవిత.. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానని గతంలో వైసీపీలో పని చేశానని, ఇప్పుడు తనకు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేదని.. వైసీపీకి ఓ దండం పెట్టి బయటకు వచ్చేశాననీ చెప్పారు. వర్మ సినిమాను కూడా అన్నీ కూడా సినిమాలు చూసినట్లుగానే చూస్తానని జీవిత పేర్కొన్నారు. తాను వైసీపీలో ఉన్నట్లుగా ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు కొంతకాలం కిందటివనీ, అప్పుడు తాను వైసీపీలో ఉన్నాననీ, అయితే ఇప్పుడు మాత్రం తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదనీ వివరణ ఇచ్చారు. మొత్తంగా దర్శకుడు వర్మ జగన్ కోసం వ్యూహం పన్ని తెరకెక్కించిన ఈ సినిమాను వర్మ ప్రత్యర్థులే ప్రతి వ్యూహం పన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. అవాస్తవాలను అవకాశానికి అనుగుణంగా నిజాలని నమ్మించే ప్రయత్నం చేసే ఇలాంటి సినిమాలను ఆదరించే పరిస్థితి లేకపోగా.. అసలు ఇలాంటి సినిమా విడుదల కాకుండా సెన్సార్ కమిటీ అడ్డుకోవడం స్వాగతించదగ్గ పరిణామమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు పడిన బ్రేకు తాత్కాలికమా? లేక శాశ్వతమా అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.