Leading News Portal in Telugu

ఆరుగురితో మజ్లిస్ తొలి జాబితా విడుదల… పెండింగ్ లో మూడు 


posted on Nov 3, 2023 4:52PM

 అందరికంటే ముందే బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తే బిఆర్ఎస్ మిత్ర పక్షమైన మజ్లిస్ పార్టీ మాత్రం అందరికంటే చివర్లో అభ్యర్థులను వెల్లడించింది.ఇవ్వాల తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ మూడుస్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను రంగంలో దింపే మజ్లిస్ పార్టీ స్వంత రాష్ట్రంలో మాత్రం కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. దీనికి కారణం లేకపోలేదు. మతతత్వ పార్టీ ముద్ర ఉన్న భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ బి టీం అనే ప్రచారం ఉంది. బిఆర్ఎస్ కు మజ్లిస్ సపోర్ట్ చేయడంతో ముస్లిం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పైగా మజ్లిస్ పోటీ చేయలేని స్థానాల్లో మాత్రం బిఆర్ఎస్ కు ఓటు వేయాలని మజ్లిస్ అధినేత పిలుపునివ్వడాన్ని ముస్లిం మత పెద్దలు తప్పు పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. పాత బస్తీలో మాత్రం మజ్లిస్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో  భాగ్య లక్ష్మి వివాదంలో ఓవైసీ సోదరులను జైల్లో పెట్టారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో మైత్రిని కొనసాగించలేకపోయింది. తర్వాత టిఆర్ఎస్ పార్టీతో మైత్రి కొనసాగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లకు ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు అభ్యర్థుల నియోజక వర్గాలను ఎక్స్ చేంజ్ చేసినప్పటికీ ఈ సారి పార్టీ అధినేత ఇద్దరికి మొండి చేయి చూపారు. గత ఎన్నికల్లో ముంతాజ్ ఖాన్ యాకుత్ పురా నియోజకవర్గం నుంచి ఓటమి చెందుతారన్న సర్వే రిపోర్ట్ ఆధారంగా మార్చాల్సి వచ్చింది. 

ఎంఐఐం తొలి జాబితా:

చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఒవైసీ

నాంపల్లి – మజీద్ హుస్సేన్

మలక్ పేట్ – అహ్మద్ బలాలా

యాకుత్ పురా – జాఫర్ హుస్సేన్

చార్మినార్ – జుల్ఫికర్

కార్వాన్ – కౌసర్ మొహియుద్దీన్

బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.