Leading News Portal in Telugu

ష్.. గప్ చుప్.. ప్రచారంలో కాళేశ్వరం పేరెత్తొద్దు.. పార్టీ నేతలకు కేసీఆర్ హుకుం! | brs and kcr silence on kaleswaram| medigadda| pillars| central| dam| safety| committee| report| elections


posted on Nov 4, 2023 12:50PM

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత కాలం గొప్పగా చెప్పుకుంటూ జబ్బలు చరుచుకున్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఇక ఆ ప్రాజెక్టు పేరే ఎత్తరా? ష్ గప్ చుప్ అంటూ కాళేశ్వరం మాటెత్తకుండానే వచ్చే ఎన్నికల ప్రచారం కానిచ్చేస్తారా? ఈ ప్రాజెక్టు రూపకల్పన, డిజైనింగ్ నుంచి ప్రతి దానికీ కర్తా, కర్మా, క్రియా అంతా తానేనని చాటుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పేరెత్తడానికి కూడా జంకుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు అపర భగీరథుడు అంటూ ఇంత కాలం కేసీఆర్ ను కీర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఆ ఊసెత్తడానికే వణికి పోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఘనతలలో కాళేశ్వరం పేరే వినిపించకపోవచ్చునని అంటున్నారు. 

నిర్మాణంలో, డిజైనింగ్ లో లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోయాయని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కేసీఆర్ నే కాదు, మొత్తం బీఆర్ఎస్ నే ఆత్మరక్షణలో పడేసిందని పరిశీలకులు అంటున్నారు.  మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు ఇసుకలో వచ్చిన కదలికల వల్ల అనీ, కుట్రకోణం అనీ రకరకాల కారణాలు చెప్పిన బీఆర్ఎస్ తీరా సేఫ్టీ అథారిటీ నివేదిక తరువాత ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో పడింది. కేంద్ర నిపుణుల కమిటీ నివేదిక తరువాత మేడిగడ్డపై మాట్లాడతానన్న కేసీఆర్ నిపుణుల కమిటీ నివేదిక తరువాత ఆ విషయమే ఎత్తడం లేదు.  మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు తరువాత కాళేశ్వరం బ్యారేజీ గురించి ఏం మాట్లాడినా.. ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు రావడం తథ్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జనంలోకి రావడానికీ, కాళేశ్వరం పేరెత్తడానికీ జంకుతున్నారు.

అందుకే కాళేశ్వరంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా బదులివ్వడానికి ముందుకు రావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.  అసలు తొలి నుంచీ కాళేశ్వరం నాణ్యతపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది, బీజేపీ కూడా కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందంటూ విమర్శలు చేసింది. ఒక్క భారీ వరదకే కాళేశ్వరం పంపులు నీట మునిగిన సందర్భంగా కాళేశ్వరం నాణ్యతపై, భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగటం, నాణ్యతా, డిజైనింగ్ లోపాలే ఇందుకు కారణమని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చిన తరువాత బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. నివేదిక తరువాత వారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇక కేసీఆర్ అయితే దీనిపై పూర్తి మౌనం వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గానే సెఫ్టి అథారిటీ రిపోర్టును కేసీఆర్ చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆ నివేదికను అధ్యయనం చేసి.. రిపోర్టును తప్పుపట్టే అవకాశాలున్నాయా అని కేసీఆర్ ఇరిగేషన్ నిపుణులను కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వారి నుంచి అభిప్రాయం వచ్చే వరకూ కాళేశ్వరం ఊసెత్తవద్దని కేసీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశించారని అంటున్నారు. 

ఈ సారి  ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను గొప్పగా ప్రచారం చేసుకోవాలని భావించిన బీఆర్ఎస్ కు ప్రాజెక్టు నాణ్యత, డిజైనింగ్ పై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఊహించని శరాఘాతంగా మారింది. సంక్షేమం, అభివృద్థి గురించి ఎంతగా చెప్పుకున్నా.. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకంగా మారే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలు బీజేపీకి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి నెట్టేసింది. అందుకే కేసీఆర్ కూడా తన ప్రసంగాలలో కాళేశ్వరం మాట కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.