Leading News Portal in Telugu

కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు. వైసీపీ ఉలికిపాటు! | sharmila support congress in telangana| fear| mounts| ap| ycp| sajjala| political| future


posted on Nov 4, 2023 2:02PM

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా వైసీపీ పార్టీకి అన్నీ తానై నడిపించిన షర్మిల.. ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి పొరుగు రాష్ట్రంలో రాజకీయంగా దీన స్థితికి చేరుకున్నారు. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి గారాల పట్టీ షర్మిలకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇక్కడ ప్రధానాంశంగా మారింది. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల ఇప్పుడు అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే పరాయి రాష్ట్రంలో  రాజకీయ ఉనికి కోసం ఎందుకు పోరాడాల్సి వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేసినా, అక్కడ ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ, చివరి నిమిషంలో  అది వీలుపడలేదు.

కాంగ్రెస్ తో పొత్తు, విలీనం జరగకపోవడంతో ఈ ఎన్నికలలో తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనున్నట్లు ఈమధ్య వరకూ షర్మిల ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో కూడా షర్మిల అదే మాట చెప్పారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు పోటీ నుండి తప్పుకున్నారు. ఈ ఎన్నికలలో తాను పోటీ చేస్తే చరిత్ర తనను క్షమించదంటూ కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. గెలవడం కంటే త్యాగం చేయడం గొప్ప విషయం అని చెప్పిన షర్మిల.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించే లక్ష్యంతో పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. షర్మిల రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనని ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారమే కాగా.. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కు మేలు జరిగేలా ఎన్నికల నుండి తప్పుకోవడంతో అది రూఢీ అయ్యింది. ఏపీలో   వైసీపీ పార్టీకి షర్మిల నిర్ణయం ఏ మాత్రం నచ్చడం లేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు.

తెలంగాణలో ష‌ర్మిల పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్రకటించడం వైసీపీ నేతలకు అస్సలు మింగుడు ప‌డ‌డం లేదు. కాంగ్రెస్ త‌నను తొక్కేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని.. త‌న‌ను సీఎం కాకుండా చేసింద‌నే భావన వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సులో బలంగా నాటుకుపోయింది. అందుకే కాంగ్రెస్ కు మేలు జరిగేలా షర్మిల తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదు. షర్మిలకు మాకు సంబంధం లేదు.. ఆమె పార్టీ ఏపీకి చెందింది కాదు అంటూనే ష‌ర్మిల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, సకల శాఖామంత్రి,  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఇప్పుడు షర్మిల ఆ పార్టీతో కలిశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందనీ తెలుసు.. కానీ, ఇప్పుడు షర్మిల ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆమె ఇష్టం అంటూ సజ్జల గోడు వెళ్లబోసుకున్నారు.

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయం నుండే వైసీపీ నేతలు షర్మిలపై విషం కక్కుతున్నారు. అన్న జగన్ తో విభేదించిన షర్మిల ఆమె భవిష్యత్ ఆమె చూసుకున్నారు. అన్న సీఎం అయ్యేందుకు కాలికి బలం కట్టుకు తిరిగిన షర్మిల అదే అన్నకు అధికారం వచ్చాక తనను దూరం పెట్టడంపై   విభేదించారని అందరికీ తెలిసిందే. తల్లి విజయమ్మ కూడా వైఖరికి విసిగిపోయి కూతురు వద్దకే చేరారనీ తెలిసిందే. అయితే  ఇప్పుడు ఆమె రాజకీయ నిర్ణయాలపై వైసీపీ నేతల అభ్యంతరం చూస్తుంటే ఆ పార్టీ నేతలు ఎంతటి అభద్రతా భావనలో ఉన్నారో తెలిసిపోతున్నది. కాగా  ఏపీలో ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఏపీ రాజకీయాలలోకి దించనున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించడంతో జరగబోయేది అదే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తమ  రాజకీయ భవిష్యత్ ఏంటన్నభయం వైసీపీ నేతలలో కనిపిస్తోందని అంటున్నారు.