ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి షాక్ తప్పదా? | five states assembly elections| shock| bjp| telangana| chattisghar| mizoram| madhyapradesh
posted on Nov 4, 2023 12:11PM
బీజేపీలో కాంగ్రెస్ సంస్కృతి పెరిగిపోతున్నదని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు. పార్టీలో వ్యక్తి పూజ తారస్థాయికి చేరిందనీ, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వం ప్రవేశించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగానే పార్టీ ప్రతిష్ట, వైభవం వేగంగా దిగజారిపోతున్నాయని భావిస్తున్నారు. అదే సమయంలో అంతర్గత కుమ్ములాటలకు, గ్రూపు రాజకీయాలకూ నెలవుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఐక్యత ప్రస్ఫుటమౌతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు. నిజమే.. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా ఆ పార్టీకి గెలుపు ధీమా కనిపించడంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ రాష్ట్ర శాఖలలో క్రమశిక్షణారాహిత్యం, అధిష్ఠానం మితిమీరిన జోక్యం, స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచేలా తీసుకున్న నిర్ణయాలే ఆయా రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి దిగజారడానికి కారణమని అంటున్నారు. ఇక ప్రీపోల్ సర్వేలు కూడా బీజేపీ విజయావకాశాలు మృగ్యమనే చెబుతున్నాయి. వీక్లీ ట్రాకర్ తాజా అంచనా ప్రకారం ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెబ్లీ ఎన్నికలలో ఏ రాష్ట్రంలోనూ కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు.
ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. 119 స్థానాలున్న తెలంగాణలో ఈ నెల 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయి. వీక్లీ ట్రాకర్ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 74 నుంచి 78 స్థానాలను దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో్ స్థానంలో బీఆర్ఎస్ 36 నుంచి 38 స్థానాలలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ రెండు స్థానాలకు పరిమితమౌతుందని వీక్లీ ట్రాకర్ పేర్కొంది.
ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజొరంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యత కనబరుస్తుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఈ నెలలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ 27 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని కైవశం చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక మొజోరం నేషనల్ ఫ్రంట్ 7 స్థానాలలో, జడ్ పిఎమ్ 5, ఇతరుల ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఛత్తీస్ గఢ్ లో కూడా అదే పరిస్థితి ఉందని.. ఆ రాష్ట్రంలో ఈ నెల 7 ,17 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 90 స్థానాలున్నఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో ఈ సారి కాంగ్రెస్ 67 నుంచి 75 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక బీజేపీ అయితే 15 నుంచి 19 స్థానాలకు పరిమితమౌతుందని అంటున్నాయి. ఈ రాష్ట్రంలో బీఎస్పీ 2 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక మధ్య ప్రదేశ్ లో కూడా బీజేపీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొంటున్నాయి. ఆ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో నవంబర్ 17న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 134 నుంచి 142 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని వీక్లీ ట్రాకర్ తాజాగా పేర్కొంది. ఇక బీజేపీ 65 నుంచి 73 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉండగా, ఇతరులు 20 నుంచి 26 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి.
రాజస్థాన్ లో కూడా బీజేపీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఈ రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంలోనూ, ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలోనూ బీజేపీ విఫలమైంది. ప్రజాదరణ ఉన్న వసుంధరారాజె వంటి నేతలను దూరం పెట్టడం ద్వారా బీజేపీ హై కమాండ్ రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలను చేజార్చుకుంది. రాజస్థాన్ లో ఈ నెల 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. వీక్లీ ట్రాకర్ మేరకు రాజస్థాన్ లో కాంగ్రెస్ 110 నుంచి 122 స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా, బీజేపీ 70 నుంచి 80 స్థానాలకు పరిమితమౌతుంది. ఇతరులు 8 నుంచి 12 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి.