Leading News Portal in Telugu

ఈటలకు బీజీపీలో మళ్లీ ఉక్కపోత.. గజ్వేల్ నుంచి పోటీకి విముఖత | etala step back to contest from gazwal| bjp| hicommand| party| tickets| angry


posted on Nov 4, 2023 10:46AM

తెలంగాణ బీజేపీలో  ఏదో జరుగుతోంది. అధికారం కోసం పడుతున్న తాపత్రయంలో  ఆ పార్టీ అధిష్ఠానం తప్పుటడుగులు వేస్తూ బలమైన నేతలను కూడా దూరం చేసుకుంటోంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్ర బీజేపీ బలంగా ఉంది. అధికార బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను కూడా దీటుగా ఎదుర్కొంది.

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అప్పట్లో పరిశీలకులు కూడా భావించారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం నుంచీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సర్కస్ లో జారుడుబండ మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న జోకర్ లా మారిపోయింది. అధికారం అన్న ధీమా నుంచి.. రాష్ట్రంలో హంగ్ వస్తే చాలు చక్రం తిప్పేద్దామన్న స్థాయికి పడిపోయింది. ఇక సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామంగా అంతా భావించేవారు.

అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనుక ఈటల వంటి వారి అసంతృప్తే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆ తరువాత ఎన్నికలు దగ్గరపడిన తరువాత బండి సంజయ్ ప్రాధాన్యతను ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చి.. ప్రచారం కోసం హెలికాప్టర్ కూడా కేటాయించింది. ఇక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఈటలకు ప్రాధాన్యత తగ్గించింది. దీంతో కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ బరిలో నిలబడతానని ప్రకటించి, అందుకు అధిష్ఠానాన్ని సైతం ఒప్పించిన ఈటల ఇప్పుడు వెనక్కు తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇందుకు కారణం.. తనను నమ్ముకు వచ్చిన వారికి పార్టీ అధిష్ఠానం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈటల అలకబూనడమే అంటున్నారు. అంతే కాకుండా హుజూరాబాద్ లో గతంలో జరిగిన ఉప ఎన్నికలో తన విజయానికి దోహదపడిన సానుభూతి ఇప్పుడు పని చేయదనీ, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బలమైన అభ్యర్థులను దింపడంతో విజయం కోసం తాను చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉందనీ ఈటల చెబుతున్నారు. అయితే ఈటల గజ్వేల్ లో వెనక్కు తగ్గడానికి బీజేపీ అధినాయతక్వం తీరుపై అసంతృప్తే కారణమని అంటున్నారు. పార్టీ టికెట్ల విషయంలో తనను నమ్ముకుని వచ్చిన వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆ కారణంగానే ఆయన గజ్వేల్ నుంచి పోటీకి నో అంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.