Leading News Portal in Telugu

సజ్జలను కడిగి పారేసిన షర్మిల | sharmila strong counter to sajjala| telangana| contest| comments| retard| jagan


posted on Nov 6, 2023 4:32PM

వైఎస్ కుటుంబంలో వివాదాలున్నాయన్నది బహిరంగ రహస్యమే.  వైసీపీ నేతలు కూడా పలుమార్లు నిజమేనని ఒప్పుకోవాల్సి వచ్చింది.  ప్రస్తుతానికి వైఎస్ రాజశేఖరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల హైదరాబాద్ లోనే నివాసం ఉంటుండగా.. తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు కనీసం రాకపోకలు కూడా లేవు. ఈ మధ్యనే జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగతంగా సోదరుడు జగన్ తో షర్మిల విభేదాల నేపథ్యంలో ఆమె తెలంగాణలో సొంత  రాజకీయ పార్టీ పెట్టుకున్నారు.  అయితే, షర్మిల తన రాజకీయ వ్యవహారాల జోలికి వైసీపీ నేతలు వస్తే ఏ మాత్రం వెనకా ముందు లేకుండా మాటలతో చీల్చి చెండాడేస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలే జరగగా మరోసారి షర్మిల వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సలహాదారు అయిన సజ్జల సకల శాఖల మంత్రిగా, షాడో సీఎంగా కీ రోల్ పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కు తెలియకుండా పార్టీలో, ప్రభుత్వంలో ఏదైనా జరుగుతుందేమో కానీ సజ్జలకు తెలియకుండా ఏదీ జరగదు.

అందుకే  షర్మిలతో జగన్ విబేధాలు, షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై కూడా సజ్జల స్పందిస్తుంటారు. కానీ షర్మిల మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా మాటలతోనే కొట్టినంత పని చేస్తారు. తాజాగా షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరీ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం తప్పు అన్నట్లుగా మాట్లాడిన సజ్జల ఆమె పార్టీ ఆమె ఇష్టం అంటూనే..  జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో  ఆ పార్టీ కోసం షర్మిల పనిచేయడం తనకు నచ్చలేదని సజ్జలలో మాట్లాడారు. కానీ, షర్మిల మాత్రం సజ్జలపై ఓ రేంజిలో  విరుచుకుపడ్డారు.  ముందు మీ సంగతి మీరు చూసుకోండి సజ్జల గారూ అంటూ వైసీపీ నేతలు షాక్ అయ్యే స్థాయిలో షర్మిల మాట్లాడారు.

సోమవారం ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల.. తాము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చామో వివరించామని.. ప్రజల కోసమే తెలంగాణా ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని.. అంతే తప్ప ఎవరో తమను పొగడాలని కిరీటాలు పెట్టాలని ఎక్కడా కోరుకోవడం లేదని అన్నారు. అలాగే సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. ముందు మీ కధ ఏంటో చూసుకోండి సజ్జల గారూ అంటూ..  వైఎస్సార్టీపీతో సంబంధం లేదని గతంలో ఇదే సజ్జల అన్నారని ఇపుడు తమ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని   నిలదీశారు. తాను తెలంగాణ రాష్ట్రంలో వైస్సార్టీపీని ఏర్పాటు చేసిన తొలి రోజునే ఆమెకు మాకు సంబంధం లేదు అంటూ చెప్పిన సజ్జల ఇప్పుడు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. మా వరకు అయితే మీరు చెప్పినట్టే సంబంధం లేదనే అనుకుంటున్నాం.. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నారా? అంటూ కడిగి పారేశారు.

అంతేకాదు, తన గురించి మాట్లాడడం కాదు.. ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. ఓవైపు సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ.. చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే.. దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ముందు కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని షర్మిల ఊహించని స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అంతే కాదు, ఈ సమాధానం సజ్జలకేనా లేక ఏపీ ముఖ్యమంత్రికి కూడానా అన్న ప్రశ్నకు షర్మిల.. సజ్జలైనా, జగన్  అయినా.. ఎవ్వరికైనా ఇదే రిప్లై అనడం కొసమెరుపు. మరి దీనికి ఏపీ వైసీపీ నేతలు, మంత్రులు, సకల శాఖల మంత్రి సజ్జల, సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇస్తారా? లేక ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మాకేం తెలియదు.. మమ్మల్ని కాదన్నట్లే ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.