ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ సీఐడీ పిటిషన్ | fibernet cid files petition for assets attach| acb| court
posted on Nov 6, 2023 3:49PM
ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. ఆస్తుల అటాచ్మెంట్ కోసం ఈ పిటిషన్ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన చేసిన సీఐడీ అనుమతివ్వాలని కోర్టును కోరింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో సోమవారం (నవంబర్ 6) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఏపీ సీఐడీ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా సీఐడీ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని కోరింది.
ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యాయని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.