సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మళ్లీ సాంకేతిక లోపం | technical problem again in kcr helicopter| sirpur| khagajnagar| uerravalli| devarakdra| asifabad
posted on Nov 8, 2023 2:16PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సోమవారం (నవంబర్ 6) దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను వెనక్కు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఆ తరువాత ఏవియేషన్ అధికారులు సీఎం పర్యటన కోసం మరో హెలికాప్టర్ పంపించారు అది వేరే విషయం. కానీ ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. బుధవారం (నవంబర్ )కూడా ఆయన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్‌కు వెళ్లారు. సీఎం ప్రయాణించే హెలికాప్టర్ లో స్వల్ప వ్యవధిలోనే రెండు సార్లు సాంకేతిక లోపం తలెత్తడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి.